జగన్పై అక్రమాస్తుల కేసులు నమోదయ్యి పదేళ్లు అవుతోంది. కానీ ఇంత వరకూ అవి ట్రయల్ వరకూ రాలేదు. క్వాష్ పిటిషన్లు.. డిశ్చార్జ్ పిటిషన్లు.. వాయిదాల పిటిషన్లు ఇలాంటి వాటితో సమయం గడిచిపోయింది. ఇప్పుడు మరోసారి ఆ కేసుల విచారణ మొదటికి రాబోతోందన్న ప్రచారం జరుగుతోంది. జగన్ అక్రమాస్తుల కేసులను విచారిస్తున్న సీబీఐ జడ్జిని బదిలీ చేశారు. కొత్త వారిని నియమించారు. సాధారణం కొత్త న్యాయమూర్తి వస్తే ఆ కేసులను మళ్లీ మొదటి నుంచి వింటారు. ప్రస్తుతం ప్రతి శుక్రవారం విచారణ జరుగుతోంది. ఆ శుక్రవారం కూడా ఏదో ఓ కారణంతో వాయిదాకే పోతోంది.
న్యాయమూర్తిని మార్చడంతో ఇప్పుడు ఆ కేసుల నిచారణ మొదటి నుంచి ప్రారంభం కానుంది. ట్రయల్స్ ఇంకా ప్రారంభం కానుంది.. ఇప్పటికీ పెండింగ్లో ఉన్న విచారణలో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ మళ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే… కేసులు మరికొన్నాళ్లు కాకుండా.. కొన్నేళ్ల పాటు సాగే అవకాశం ఉంది. ఈడీ కేసులూ అంతేనని చెబుతున్నారు.
ఇటీవల సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధులపై కేసులు.. ముఖ్యంగా తీవ్ర నేరాలు ఉన్న వారి కేసులను వీలైనంత త్వరగా విచారణ జరపాలని చెబుతోంది. కొన్ని రకాల కేసులు విచారణలో ఉన్నాయి కానీ అవి ఎన్నికల నేరాల కేసులు . తీవ్ర ఆర్థిక నేరాల కేసులు ఇంకా విచారణకు రావడం లేదు. ఇటీవల ఈ అంశంపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. సుప్రీంకోర్టు ఈ విషయంలో సంచలన ఆదేశాలు ఇస్తే… తప్ప.. జగన్ కేసుల విచారణ ఆలస్యం కావడం ఖాయమని నమ్ముతున్నారు