గత ఎన్నికల్లో ఏపీలో రాజకీయం చేసిన కేఏ పాల్ ఈ సారి మాత్రం తెలంగాణను కార్యక్షేత్రంగా ఎంచుకున్నారు. అయితే ఆయనకు ఆదిలోనే దెబ్బలు తగులుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంటలు నష్టపోయినరైతులను పరామర్శించడానికి ఆయన వెళ్తే.. ఆక్కడ టీఆర్ఎస్ నేతలు దాడి చేసి కొట్టారు. పోలీసులు ఆయనపై దాడి చేసే వరకూ చూసి.. ఇంకా ఇక్కడే ఉంటే దాడులు చేస్తారని పరామర్శలు చేయనివ్వకుండానే వెనక్కి పంపేశారు. ఈ రాజకీయాన్ని చూసి కేఏ పాల్‌కు మైండ్ బ్లాంక్ అయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో ఇటీవల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సోమవారం హైదరాబాద్ నుంచి బస్వాపూర్ బయలుదేరారు. ఆయనను సిద్దిపేట జిల్లా జక్కాపూర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కేఏ పాల్ బస్వాపూర్ వెళితే ఉద్రిక్తత నెలకొంటుందని అందుకని అడ్డుకున్నామని పోలీసులు తెలిపారు. తనను ఎందుకు అడ్డుకున్నారని కేఏ పాల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్త అనిల్ దాడి చేశాడు. అతడ్ని పోలీసులు అడ్డుకున్నారు. తనపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్, కేటీఆర్ పై ఎవడైనా విమర్శలు చేస్తే భౌతిక దాడులు చేస్తామని పాల్‌పై దాడి చేసిన అనిల్ అనే వ్యక్తి ప్రకటించారు.డీఎస్పీ సమక్షంలోనే తనపై దాడి చేయడం సిగ్గుచేటని పాల్ మండిపడ్డారు. పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులకు జీతాలు కేటీఆర్ ఇస్తున్నారా, ప్రజల నుంచి వస్తున్నాయా అని పాల్ ప్రశ్నించారు. అయితే పాల్ రైతులను పరామర్శిస్తే ఏమవతుుందని ఆయనపైనా దాడి చేయాల్సిన అవసరం ఏమిటని ఇతరులు ఆశ్చర్యపోతున్నారు.