అమరావతి విషయంలో ఏపీ ప్రభుత్వం ఆడుతున్న దాగుడుమూతల కారణంగా అప్పులివ్వడానికి బ్యాంకులు కూడా నిరాకరిస్తున్నారు. కోర్టు తీర్పును సైతం ధిక్కరించిన ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానులే తమ విధానమని ప్రకటించింది. దీంతో మూడు రాజధానుల్లో ఒకటి అయిన అమరావతిలో ఖర్చు చేసేందుకు తాము అప్పులివ్వలేమని బ్యాంకులు చెబుతున్నాయి. అమరావతికి గతంలో రుణం ఇచ్చేందుకు అంగీకరించిన బ్యాంకుల కన్సార్షియంను ప్రస్తుత ప్రభుత్వం సంప్రదిస్తోంది. అదే పనిగా చర్చలు జరుపుతోంది. కానీ బ్యాంకులు మాత్రం ప్రభుత్వాన్ని నమ్మలేకపోతున్నాయి.
అమరావతిలో ఇప్పటికే పైపైన పనులు ప్రారంభించారు। శాసన రాజధానికి అవసరమైన భవనాలు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లు.. ఇతరు అవసరాల భవనాలు మాత్రమే పూర్తి చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం అమరావతిని ఉద్దేశం లేదని బ్యాంకులు కూడా నిర్ణయానికి వస్తున్నాయి. ఒకే రాజధానిగా అమరావతి ఉంటుందని అఫిడవిట్ ఇస్తేనే రుణం ఇస్తామని బ్యాంకులు అంటున్నాయి. అలాంటి అఫిడవిట్ ఇచ్చే పని అయితే ఈ సమస్య ఇంత పెద్దదయ్యేదే కాదు.
ప్రభుత్వానికి కూడా బ్యాంకుల నుంచి అమరావతి రుణం తీసుకోవాలని లేదని.. బ్యాంకులు అప్పులివ్వడం లేదన్న కారణంగా నిర్మించలేకపోతున్నామని హైకోర్టుకు కారణం చెప్పడానికి మాత్రమే ఇలా ప్రయత్నిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. అమరావతి నిర్మాణంపై మొదటి నుంచి ప్రభుత్వం విముఖంగా ఉంది. కానీ కోర్టు తీర్పు మాత్రం రైతులకు అనుకూలంగా వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం నిర్మించలేకపోవడానికి కోర్టుకు కారణాలు చెప్పనుంది.