తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ పై కేసీఆర్‌కు మొహం మెత్తిందని అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఏపీ క్యాడర్‌కు చెందిన ఆయన క్యాట్‌లో ఆర్డర్స్‌లో తెచ్చుకుని తెలంగాణలో కొనసాగుతున్నారు. కానీ ఆయన విధుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంతో ఉంటారన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల సీఎంలు, చీఫ్ జస్టిస్‌ల సమావేశంలో సీజేఐ ఎన్వీ రమణ సీఎస్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదొక్కటే కాదు కేసీఆర్ చెప్పిన చాలా అంశాలు కూడా ఎక్కడివక్కడే ఉంటున్నాయని ముందుకు నడవడం లేదని అంటున్నారు. సీఎస్ వ్యవహారశైలితో సీఎం కూడా అసంతృప్తిగా ఉన్నారని చెబుతున్నారు.
నిజానికి సీఎస్ సోమేష్ కుమార్‌పై కేసీఆర్‌కు ఎంతో నమ్మకం ఉంది. దాదాపుగా పన్నెండు మంది సీనియర్లను కాదని ఆయనకు సీఎస్ పదవి ఇచ్చారు. ఆయనకు అసలు సీనియార్టీ లేదని.. రెండు సార్లు లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేటు సంస్థల్లో పని చేశారని… రేవంత్ రెడ్డి లాంటి వారు ఆరోపిస్తూ ఉంటారు. మరో వైపు వివాదాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ నమ్మకమైన సీఎస్ అని కేసీఆర్ ఆయనకు పదవి కట్టబెట్టారు. కానీ ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో ఆయన నిర్లక్ష్య వైఖరి కారణంగా ప్రభుత్వానికి సమస్యలు వస్తున్నాయని కేసీఆర్ ఆలోచనలో పడ్డారంటున్నారు.
కేసీఆర్ ఆలోచనల్లో సీఎస్‌గా రామకృష్ణారావు ఉన్నారంటున్నారు. రామకృష్ణారావు ప్రస్తుతం ఆర్థిక శాఖ బాధ్యతలు చూస్తున్నారు. క్లిష్టమైన సవాళ్లను ఆయన ఎదుర్కొంటున్నారని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆయన కేసీఆర్ సామాజికవర్గానికి చెందిన అధికారి. వచ్చే ఎన్నికల సమయంలో సీఎస్‌గా ఆయన ఉంటే పనులు చాలా వరకూ సాఫీగా సాగిపోతాయని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్లుగ తెలుస్తోంది. ఈ కారణంగా సోమేష్‌కు పదవీ గండం పొంచి ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.