తెలుగు360 రేటింగ్ 2.5/5
లాక్ డౌన్, కరోనా వల్ల చాలా నష్టాలే జరిగాయి. అందులోనూ పాజిటీవ్ విషయాలు వెదుక్కోవాలంటే.. కొన్ని కథలకు ముడి సరుకు దొరికింది. లాక్ డౌన్, కరోనా నేపథ్యాన్ని కథలో తెలివిగా వాడుకుని, కొన్ని సినిమాలు తీశారు. అవి పెద్దగా వర్కవుట్ కాలేదనుకోండి. కాకపోతే.. కథని ఓ కొత్త కోణంలో చూసే అవకాశం మాత్రం దక్కింది. అశోక వనంలో అర్జున కల్యాణం కూడా అలాంటి కథే. పెళ్లి – లాక్ డౌన్… ఈ రెండింటికీ ముడి పెట్టిన సినిమా ఇది. అలాగని.. వివాహ వ్యవస్థపై రొడ్డకొట్టుడు ఉపన్యాసాలు గానీ, లాక్ డౌన్ కష్టాలు కానీ ఈ సినిమాలో చూపించలేదు. మరింతకీ ఈ సినిమాలో ఏముంది? ఎలా ఉంది? కాస్త డిటైలింగ్ లోకి వెళ్తే..?
ముఫ్ఫై మూడేళ్లొచ్చినా పెళ్లి కాని ప్రసాద్‌లా మిగిలిపోయాడు.. అల్లం అర్జున్ కుమార్ (విశ్వక్సేన్). ఇప్పటికైనా ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలన్నది తన ఆశ. ఇంట్లో ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కావు. అసలు తన కాస్ట్ లో అమ్మాయిలే లేకపోవడంతో, తెలంగాణ నుంచి ఆంధ్రా వచ్చి, అక్కడ క్యాస్ట్ వేరైనా… పసుపులేని మాధవి (రుక్సాన్ థిల్లాన్)తో నిశ్చితార్థానికి రెడీ అవుతాడు. అర్జున్ కుమార్ చుట్టాలంతా ఓ డొక్కు బస్సులో.. గోదావరి తీరంలోని అశోకపురంకి వస్తారు. నిశ్చితార్థం కూడా అయిపోతుంది. తిరిగివెళ్లేటప్పుడు బస్సు మొరాయిస్తుంది. దాంతో పెళ్లి కూతురి ఇంట్లోనే మరో రోజు కూడా ఉండిపోవాల్సివస్తుంది. అయితే.. సడన్ గా జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ వల్ల మరో ఇరవై రోజులు ఆ ఇంట్లోనే తిష్ట వేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇన్ని రోజుల ప్రయాణంలో అనుకోని పరిస్థితులు తలెత్తుతాయి. వాటి వల్ల అర్జున్ ప్రసాద్ పెళ్లి.. ఎలా గోల గోలగా మారింది? తరవాత ఏమైంది? అనేది మిగిలిన కథ.
కథగా చెప్పుకుంటే.. కాస్తో కూస్తో నావల్టీ కనిపిస్తుంది. తెలంగాణ అబ్బాయి… ఆంధ్రా అమ్మాయిని వెదుక్కుంటూ వెళ్లి పెళ్లి చేసుకోవాలనుకోవడం, లాక్ డౌన్ వల్ల అదే ఇంట్లో ఇరుక్కుపోవడం, ఆ తరవాత.. జరిగే రకరకాల పరిణామాలూ, రెండు కుటుంబాల మధ్య మొదలైన అలకలు, చిరుబుర్రులు.. ఇవన్నీ సరదాగా సాగే ప్రయాణమే. మధ్యలో `నాకు పెళ్లవుతుందా, లేదా` అంటూ అర్జున్ కుమార్ పడే తాపత్రయం.. ఇదంతా వర్కవుట్ అయ్యే వ్యవహారాలే. చాలా కూల్ కూల్ మాంటేజెస్ తో సినిమా మొదలవుతుంది. ఎక్కడా అర్భాటాలూ, హడావుడీ కనిపించదు. పెళ్లింట్లో మనకు కనిపించే పాత్రలే తెరపైనా దర్శనమిస్తాయి. కెమెరామెన్లు చేసే ఓవరాక్షన్లు, పెళ్లి పెద్దలా వచ్చి, లేని పోని విషయాలకు చిరుబుర్రులాడే మనుషులు, వాళ్ల మనస్తత్వాలు, చుట్టాల పేరుతో ఆధిపత్యం చెలాయించే వ్యక్తులు… ఇవన్నీ దర్శకుడు బాగా పట్టాడు. ఆయా పాత్రల్ని, సందర్భానికి తగ్గట్టుగా వాడుకోవడం.. అర్జున్ కుమార్ క్యారెక్టరైజేషన్ పై ఉండే జాలి, సానుభూతి.. ఇవన్నీ తొలి సగాన్ని ఎలాంటి కుదుపూ లేకుండా దాటించేస్తాయి.
ద్వితీయార్థంలో కొన్ని కుదుపులకు లోనైంది. పెళ్లి కూతురు ఇంట్లోంచి వెళ్లిపోతే… చెల్లాయి.. హీరోని ప్రేమించడం అతకదు. అంతకు ముందు సీన్లలో చెల్లాయి వసుధ (రితిక)ని చాలా తెలివైన పిల్లగా, స్వతంత్య్ర భావాలున్న అమ్మాయిగా చూపించి.. సెకండాఫ్‌లో కథ కోసం, సన్నివేశాల కోసం.. మళ్లీ సగటు ఆడపిల్లలానే మార్చేయడం ఆశ్చర్యపరుస్తోంది. అమ్మాయిల రేటు ఎందుకు తగ్గిపోతోంది? అసలు పెళ్లి ఎవరిని? ఎప్పుడు? ఎందుకు చేసుకోవాలి? అనే రెండు పాయింట్ల మీద… సెకండాఫ్‌లో కాస్త ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. దాంతో కొన్ని చోట్ల సన్నివేశాల్లో స్పీచులు దంచికొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. `తాగితే కోపం వస్తుంది` అని చెప్పే హీరో తో మందు కొట్టించి తన ఫస్ట్రేషన్ అంతా కక్కించడం, కెమెరామెన్ తో కాదంబరి కిరణ్ సంభాషణ.. ఈ రెండు సీన్లు బాగా రక్తి కట్టాయి. తెలంగాణ, ఆంధ్రా మధ్య కల్చర్ పరమైన తేడా చాలా స్పష్టంగా ఉంటుంది. దాన్ని వాడుకుని ఫన్ పుట్టిస్తే బాగుండేది. ముఖ్యంగా.. తెలంగాణలో కక్కా, ముక్కా లేకపోతే.. ఏ విందూ నడవదు. ఆంధ్రాలో అలా కాదు. తొలి సన్నివేశాల్లో దర్శకుడు ఈ పాయింట్ పట్టుకున్నా, మధ్యలోనే వదిలేశాడు. వెన్నెల కిషోర్‌తో ఓ ట్రాక్ పెట్టాడు గానీ, పెద్దగా వర్కవుట్ కాలేదు. క్లైమాక్స్‌లో ఊహకందని అద్భుతాలేం జరగవు. సెకండాఫ్ మొదలవ్వగానే.. క్లైమాక్స్‌లో ఏం జరగుతుందన్న అంచనాకు ప్రేక్షకుడు వచ్చేశాడు. దానికి తగ్గట్టే సినిమా సాగింది. కథకి ప్లస్సూ, మైనస్సూ లాక్ డౌనే. అందుకే కథంతా ఓ గిరి గీసుకుని తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ గిరిని దాటి బయటకు రావడానికి చాలా కష్టపడాల్సివచ్చింది. అలాగని లాక్ డౌన్ వల్ల కలిగిన నష్టాలు ఏకరువు పెట్టలేదు. ఆ విషయంలో సంతోషించాల్సిందే.
విశ్వక్సేన్ నటన చాలా డీసెంట్ గా ఉంది. మూతికి అతికించిన మీసంతో విశ్వక్నిచూడ్డానికి కాస్త ఇబ్బంది పడినా.. రాను రాను అల్లం అర్జున్ కుమార్ పాత్రతో ప్రేక్షకుడు ట్రావెల్ చేయడం మొదలెడతాడు. మందు తాగిన సీన్లో పూర్తి విశ్వక్‌ని చూసే అవకాశం దక్కింది. అంత వరకూ తాను అండర్ ప్లేనే చేస్తాడు. కావాలని చేశాడో, అలా జరిగిపోయిందో తెలీదు గానీ, చాలా చోట్ల.. ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కనిపిస్తుంటుంది. ఇద్దరు హీరోయిన్లూ పద్ధతిగా ఉన్నారు. ఎక్కువ స్క్రీన్ స్పేస్, డైలాగులు.. రితికే దక్కాయి. మిగిలిన కాస్టింగ్, వాళ్ల సెలక్షన్ బాగుంది. ముఖ్యంగా.. కాదంబరి కిరణ్ పాత్ర గుర్తుంటుంది. ప్రతీ పెళ్లిలోనూ.. ఇలా అరచి గోల పెట్టేవాళ్లు ఒకరుంటారు. వాళ్లతో మనం రిలేట్ అయిపోతాం. పెళ్లికూతురు తండ్రిగా పసుపులేని రాంబాబు నటించిన పీడీ శ్రీనివాస్… సాధారణ మధ్యతరగతి తండ్రిగా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ చేశాడు. ఇక కొంతమంది భాషని అటూ ఇటూ కాకుండా వాడడం ఇబ్బంది కలిగిస్తుంది. పూర్తిగా తెలంగాణలోనైనా మాట్లాడాలి. లేదంటే.. మామూలు భాషలో అయినా మాట్లాడాలి. అలా కాకుండా.. ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు తెలంగాణ యాస పట్టుకుని, మిగిలిన సమయాల్లో వదిలేయడం భావ్యం కాదు.
రాత విషయంలో కాస్త శ్రద్ధ తీసుకున్న సినిమా ఇది. ఎక్కడా అతికి పోలేదు. అసహత్వం లేకుండా చూసుకున్నారు. కానీ సెకండాఫ్ బాగా ఇబ్బంది పెడుతుంది. `సినిమా ఇంకా అవ్వలేదేంటి?` అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. ఓ దశ దాటాక. కథ ఆగిపోయింది కూడా. శుభం కార్డు కోసం ఎదురు చూడడం ఒక్కటే చేయగలిగింది. పాటలు కథలో భాగంగా వస్తూ పోతూ ఉంటాయి. సంభాషణలు సహజంగానే ఉన్నాయి. ఫొటోగ్రఫీ, కలర్ టోన్… బాగున్నాయి.
మొత్తానికి అశోకవనంలో అర్జున కల్యాణం… డీసెంట్‌గా సాగింది. ఆహా.. అనిపించే అద్భుతాలు లేవు. అలాగని.. థియేటర్ నుంచి హాహాకారాలు పెడుతూ పరుగులు పెట్టించే సినిమా కూడా కాదు. ఓటీటీ వరకూ అయితే.. ఇంట్లో హాయిగా కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ., చూసే సినిమా.
తెలుగు360 రేటింగ్ 2.5/5