వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ టీఆర్ఎస్- బీజేపీ లపై వార్ డిక్లేర్ చేశారు. రెండుపార్టీలు ఒకటేనని.. ప్రకటించారు. రైతు డిక్లరేషన్ ద్వారా ఇక ఎన్నికలకు సమాయత్తమవ్వాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. తెలంగాణను ఆగం చేసిన కేసీఆర్‌తో కలిసే ప్రసక్తే లేదని ఇకపై ఈ ప్రశ్న ఏ కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు అడిగినా బహిష్కరిస్తామని ప్రకటించారు. వాళ్లెవరైనా ఎంత పెద్దవాళ్లైనా సరే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్‌ఎస్, బీజేపీ నేతలతో సంబంధాలు పెట్టుకున్నా పార్టీని విడిచిపెట్టి పోవచ్చునని అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ కు అవసరం లేదని తేల్చి చెప్పారు. సిద్ధాంత పరమైన పోరాటం చేసి టీఆర్‌ఎస్‌ను ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.
డిక్లరేషన్ పత్రం కాదు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ !
వరంగల్ రైతు సంఘర్షణ సభ వేదికగా రేవంత్ రెడ్డి ప్రకటించిన డిక్లరేషన్ కేవలం కాగితం కాదని.. అది రైతులకు కాంగ్రెస్ పార్టీ తరపున ఇస్తున్న గ్యారంటీ కార్డు అని రాహుల్ గాంధీ ప్రకటించారు. మరోసారి డిక్లరేషన్ చదవండీ… రైతులందరితో చదివించండి.. ప్రతి అంశంపై చర్చించండి.. కాంగ్రెస్ గ్యారెంటీ అని ఇంటింటికీ తిరిగి చెప్పండి. రైతులు బలహీన పడితే తెలంగాణ రాష్ట్రం ప్రగతిపథంలో నడవలేదని రాహుల్ గుర్తు చేశారు. అలాంటి సందర్భంలో రైతులకు అండగా ఉండేందుకే ఈ డిక్లరేషన్ ప్రకటించాం. ఇది మీకు ధైర్యాన్ని ఇస్తుందని రాహుల్ తెలిపారు. ఎనిమిదేళ్ల నుంచి పరిపాలన చేస్తున్న టీఆర్ఎస్ పరిపాలనలో కేవలం ఒక కుటుంబమే బాగుపడుతోందన్నారు. మిగతా వారి పరిస్థితి ఏంటని రాహుల్ ప్రశ్నించారు.
టీఆర్ఎస్‌కు రెండు సార్లు చాన్సిచ్చారు.. కాంగ్రెస్‌కు ఓ సారి చాన్స్ ఇవ్వండి !
తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండుసార్లు టీఆర్‌ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. రైతులకు, అన్ని వర్గాల వారికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్‌కు నష్టం వాటిల్లుతుందని తెలిసినా రాష్ట్ర ఏర్పాటు వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందని రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని రాహుల్ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలకు సంబంధించి ప్రజల ప్రభుత్వం … రైతుల ప్రభుత్వం.. బడుగు, బలహీన వర్గాల ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశించామని కానీ అది కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యలపై పోరాటం చేసిన వారికే టిక్కెట్లు !
జనాల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేసిన వాళ్లకే టికెట్లు ఇస్తామని రాహుల్ సభా వేదికగా ప్రకటించారు. మెరిట్ ఆధారంగానే టికెట్లు ఇస్తాం… ఎన్నికల సమయం వచ్చే వరకు ఇలాంటి ప్రస్తావన తీసుకురావద్దని రాహుల్ స్పష్టం చేశారు. ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉన్న వాళ్లకే టికెట్లు ఇస్తాం…లేకపోతే ఎంత పెద్దవాళ్లైనా సరే టికెట్ ఇచ్చేది లేదన్నారు.
వరంగల్ డిక్లరేషన్ ప్రధాన హామీ ఇవి :
రైతులకు ఏక కాలంలో రూ. రెండు లక్షల రుణమాఫీ, రైతులు, కౌలు రైతులకు ఎకరాకు ఏడాదికి రూ. పదిహేను వేల పెట్టుబడి సాయం
– ఉపాధి హామీలో నమోదు చేసుకున్న ప్రతి రైతు కూలీకి ఎటా రూ. పన్నెండు వేల ఆర్థిక సాయం , గిరిజనులకు భూమిపై యాజమాన్య హక్కులు , ధరణి పోర్టర్ రద్దు , రైతు కమిషన్ ఏర్పాట, మూతపడిన చెరుకు ఫ్యాక్టరీల రీ ఓపెనింగ్ తో పాటు అన్నిరకాల పంటలకూ మద్దతు ధరలు పెంచుతామని ప్రకటించారు.