తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ లేనంత ఉత్సాహం ఇప్పుడు కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. బహిరంగసభలో పాల్గొన్నారు. ఈ ఒక్క బహిరంగసభ ద్వారా అటు ప్రజలకు.. ఇటు పార్టీ నేతలకు ఇవ్వాల్సిన సందేశాన్ని.. హెచ్చరికలను తెలివిగా పంపించగలిగారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వమని రాహుల్ గాంధీ అడగారు. ఈ విషయంలో ఆయన మొహమాటానికి పోలేదు. అదే సమయంలో ఉత్తినే ఒక్క చాన్స్ వద్దని.. తాము ఏం చేస్తామో కూడా వివరించారు. తాము మాట నిలబెట్టుకుంటామనడానికి చత్తీస్ ఘడ్ పాలన సాక్ష్యమని కూడా చూపించారు. రాహుల్ మాటలు ప్రజల్లో ప్రభావం చూపిస్తాయని కాంగ్రెస్ నేతలు నమ్మకంగా ఉన్నారు.
అదే సమయంలో ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ నేతలు మాత్రం తమలో తాము కొట్లాడుకుని పక్క పార్టీలను గెలిపిస్తారని చెప్పుకునే విశ్లేషణలకూ చెక్ పెట్టడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారు. పార్టీ సిద్దాంతాలను ప్రశ్నించిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ ఇలా బహిరంగసభా వేదికపై నుంచి వార్నింగ్ ఇవ్వడం కొత్త. ఆయన తీరులో మార్పు వచ్చిందని … ఇప్పటివరకూ ఆయన సర్ది చెప్పే ప్రయత్నం చేశారని ఇక ఊరుకోబోమనే సంకేతాలు పంపినట్లుగా స్పష్టమయింది.
టీ కాంగ్రెస్‌లో కొంత మంది నేతలు టీఆర్ఎస్తో పొత్తు ప్రతిపాదన తెస్తున్నారు. టీఆర్ఎస్తో కుమ్మక్కయి ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై రేవంత్ రెడ్డి కూడా హైకమాండ్ వద్ద పూర్తి స్థాయి నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. టీఆర్ఎస్, బీజేపీతో కుమ్మక్కయిన కొంత మంది నేతలు పొత్తుల ప్రతిపాదనలు చేసి కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని రేవంత్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై రాహుల్ గాంధీ సీరియస్‌గా స్పందించారు. టీఆర్ఎస్తో పొత్తుపై ఎవరు చర్చించినా వారిని పార్టీ నుంచి తొలగిస్తామన్నారు.
మొత్తంగా కాంగ్రెస్ పార్టీని రేసులో నిలబెట్టడానికి.. ప్రజల్లో నమ్మకం కలిగించడానికి రేవంత్ రెడ్డి ఎలాంటి ఎఫెక్ట్ కోరుకున్నారో రాహుల్ గాంధీ అలాంటి ఎఫెక్ట్ ఇచ్చారు. పూర్తిగా రేవంత్ రెడ్డి కనుసన్నల్లో జరిగిన ఈ సభ నిర్వహణ రాహుల్ గాంధీని కూడా ఆకర్షించింది. సభకు భారీగా జన సమీకరణ చేస్తే రేవంత్‌కు ఎక్కడ పేరు వస్తుందో అనికొంత మంది నేతలు లైట్ తీసుకున్నా.. జన సమీకరణలో ఎక్కడా తగ్గలేదు. రాహుల్ గాంధీ ఇమేజ్ను పక్కాగా వాడుకుంటున్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ ఈతి బాధలకు ఓ పరిష్కారం చూపినట్లుగానే విశ్లేషకులు భావిస్తున్నారు.