ఏపీలో ముందస్తు ఎన్నికలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ముందస్తు అనే ప్రశ్నే లేదని చెబుతూ వస్తున్న వైసీపీ నేతలు ఇప్పుడు మాట మార్చారు. ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నామని మాట్లాడుతున్నారు. వాళ్లో వీళ్లో మాట్లాడితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ.. జగన్ రాజకీయ ఆలోచనల్ని పూర్తి స్థాయిలో ప్రభావితం చేసి.. పార్టీ స్ట్రాటజీల్నీ బయటకు కొత్త పద్దతిలో చెప్పే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంతోనే నమ్మాల్సి వస్తోంది. ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తున్నామని సజ్జల మీడియాతో చెప్పుకొచ్చారు.
మామూలుగా అయితే ఆయన ఇలా చెప్పరు. కానీ ముందస్తు సంకేతాలు పంపాలని అనుకున్నారు కాబట్టే చెప్పారని భావిస్తున్నారు. మాములుగా రెండేళ్లలో ఎన్నికలు వస్తాయి. ఏడాదిలో వచ్చే చాన్స్ లేదు. తెలంగాణలో వచ్చే ఏడాది ద్వతీయార్థంలో ఎన్నికలు జరగనున్నాయి. ఓ ఆరు నెలల ముందే కేసీఆర్ ఎన్నికలకు వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారని అందుకే కొత్తగా ఏడాదిలో ఎన్నికలు అని చెబుతున్నారని అంటున్నారు.
ముందస్తు గురించి ఇటీవల మంత్రులు కూడా అదే పనిగా మాట్లాడుతున్నారు. మీడియా సమావేశాల్లో ఎవరూ అడగకపోయినా ముందస్తు ఉండదంటూ చెబుతున్నారు. ముందస్తు ఎన్నికలపై చర్చ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పరిపాలనా.. ఆర్థిక .. రాజకీయ పరిస్థితులను చూస్తే జగన్ ఖచ్చితంగా ముందస్తుకు వెళ్తారమని టీడీపీ కూడా నమ్ముతోంది. అందుకే రాజకీయ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. ప్రజల్లోకి వెళ్లిపోయారు. ఏపీలో పార్లమెంట్‌తో పాటు కాకుండా విడిగా అసెంబ్లీ ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది.