సర్వీసులో తొలి సారి కోర్టు విచారణకు హాజరయ్యాను.. అని ఇటీవల చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఓ కేసులో వర్చువల్‌గా హైకోర్టు ధర్మాసనం ముందు హాజరై.. తన గోడును వినిపించుకున్నారు. అలా హాజరవడానికి కారణం ఆయనే. ఆయన చేసుకున్నారు కాబట్టే హాజరయ్యారు. ఒక్క సారి కోర్టుకు హాజయితేనే అంత బాధపడ్డారు కానీ ఆయన టీం అంతా జైలు శిక్షలకు గురవుతున్నా.. అంతా సాధారణమే అన్నట్లుగా ఉంటున్నారు. ఏపీలో ఐఏఎస్‌లకు జైలు శిక్షలు పడటం కామన్‌గా మారిపోయింది.
ఇటీవల ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలుశిక్ష వేశారు. వెంటనే క్షమాపణలు చెప్పడంతో సేవా శిక్ష వేశారు. తర్వాత డివిజనల్ బెంచ్‌కు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. మొన్న రిటైరైనప్పటికీ వాడ్రేవు చినవీరభద్రుడు అనే ఐఏఎస్‌కు జైలు శిక్ష పడింది. నిన్న పూనం మాలకొండయ్య, హెచ్.అరుణ్‌కుమార్, జి.వీరపాండ్యన్‌కు నెల రోజుల సాధారణ జైలుశిక్ష వేశారు. ఇంకా కొన్ని వందల కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ కేసుల్లో ఎంత మందికి జైలు శిక్ష పడుతుందో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే కోర్టు ఉత్తర్వులకు కనీస విలువ కూడా అధికారులు ఇవ్వలేదు.
కోర్టు ఆదేశించిన ప్రభుత్వం వద్దనడం వల్లే వారు ఆ తీర్పులు అమలు చేయలేకపోతున్నారు. కాని శిక్ష వారికి పడుతోంది. వీరిపై ప్రభుత్వం కనీసం సానుభూతి కూడా చూపించడం లేదు. కానీ అధికారులు మాత్రం ఈ విషయాన్ని గుర్తించడం లేదు. తాము ఇంత బతుకు బతికీ జైలు శిక్షకు గురవుతున్నామన్న కనీస ఆవేదనకు కూడా గురి కావడం లేదు. ప్రమాణం చేసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నామని భావించడం లేదు. ఆ కారణంగానే పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏది ఏమైనా దేశం మొత్తం తిరిగి చూసేలా ఏపీ అధికారులు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఇది ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో అంచనా వేయడం కష్టమే.