`కావాలి జగన్..రావాలి జగన్` అనే స్లోగన్ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. అది పొలిటికల్ గేర్ అయితే.. `కావాలి టీవీ 9.. రావాలి టీవీ9` అనేది సినిమా వాళ్ల స్లోగన్. అవును.. టీవీ 9 లో డిబేట్ పెట్టించుకుని, రివర్స్‌లో టీవీ 9తో గొడవ పెట్టుకుంటే.. సదరు సినిమాకి బోలెడంత ప్లస్సు. ఈ విషయం చాలా సార్లు నిరూపితమైంది. ఇప్పుడు లేటెస్ట్ గా `అశోక వనంలో అర్జున కల్యాణం`తో కూడా.
యాంకర్ నాగవల్లికీ, విశ్వక్సేన్కీ మధ్య జరిగిన రచ్చ తెలిసిందే. ఇందులో తప్పు ఎవరిది? ఒప్పు ఎవరిది? అనేది పక్కన పెడితే – సదరు సినిమాకి ఫ్రీగా పబ్లిసిటీ తీసుకొచ్చినట్టైంది. ఇది వరకు ఈ సినిమా గురించి తెలియనివాళ్లకు సైతం.. తెలిసేలా చేసింది. కోట్లు పెట్టినా రాని ప్రచారం ఉత్తి పుణ్యానికి వచ్చేసింది. ఇది మొదటిసారా అంటే కాదు. అర్జున్ రెడ్డి విషయంలోనూ ఇదే జరిగింది. ఆసినిమా టీజర్, ట్రైలర్ ఫుటేజీ పెట్టుకుని, ఇదే నాగవల్లి… విజయ్‌దేవరకొండని ఇంటర్వ్యూకి పిలిచింది. అక్కడా ఇలాంటి తింగరి తింగరి ప్రశ్నలే వేయడం, విజయ్… స్ట్రయిట్ గా సమాధానాలు చెప్పడంతో ఆ ఇంటర్వ్యూ బాగా వైరల్ అయ్యింది. దాంతో.. అర్జున్ రెడ్డికి ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టైంది. ఆ తరవాత కూడా విజయ్..`టీవీ 9 నాగవల్లి వల్లే… నా సినిమాకి ప్రమోషన్లు దొరికాయి` అని సభాముఖంగా (అప్పుడు నాగవల్లి కూడా ఉంది) చెప్పాడు. `డీజే టిల్లు` సమయంలో… సిద్దు జొన్నలగడ్డతో చేసిన చిట్ చాట్ కూడా ఇలానే వైరల్ అయి ప్రమోషన్లకు బాగా ఉపయోగడపింది. ఇప్పుడు విశ్వక్ వంతు వచ్చింది.
ఈ వారం మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో అశోకవనంలో.. సినిమాకి మాత్రమే వసూళ్లు కనిపించాయి. అలాగని ఇదేదో హిట్ సినిమా అని కాదు. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే.. ఈ సినిమాకి ప్రమోషన్లు గట్టిగా దక్కాయి. అది కూడా టీవీ 9 మహత్తు వల్ల. అందుకే ఈ విషయంలో… విశ్వక్ అండ్ టీమ్ టీవీ 9కి ముఖ్యంగా దేవి నాగవల్లికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక మీదట కూడా.. ఏ సినిమాకైనా ఫ్రీ పబ్లిసిటీ దక్కాలంటే నాగవల్లితో ములాఖాత్ అయ్యేలా చూసుకుంటే చాలు. కావల్సినంత పబ్లిసిటీ.