తెలుగు మీడియా రంగంలో ఉవ్వెత్తున ఎగసి.. రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో బలైపోయిన టీవీ9 రవిప్రకాష్ చాలా కాలంగా ఆజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కొత్త మీడియా సంస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ జరుగుతోంది కానీ నిజాలేమిటో తెలియదు. హఠాత్తుగా ఆయన హైదరాబాద్ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. వరంగల్ సభ తర్వాత హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ తాజ్ కృష్ణ హోటల్‌లో బస చేశారు.
ఈ సందర్భంగా మీడియా అధిపతులు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులతో భేటీ అయ్యారు. ఈ సమావేశాలకు రవిప్రకాష్ కూడా హాజరయ్యారు. రవిప్రకాష్ ప్రస్తుతం ఏ మీడియా సంస్థలోనూ లేరు. అయినప్పటికీ కాంగ్రెస్ వర్గాలు ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. రవిప్రకాష్ మళ్లీ మీడియాలో తనదైన ముద్ర వేయాలని తప్పకుండా ప్రయత్నిస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఆయన ప్రయత్నాలకు కాంగ్రెస్ నేతలు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నారు. అయితే గతంలో రవిప్రకాష్ బీజేపీ నేతలతోనూ సమావేశమైనట్లుగా వార్తలు వచ్చాయి. ఏదేమైనా.. రవిప్రకాష్ ఇప్పుడు సంధి స్థితిలో ఉన్నారు. ప్రభుత్వాలు మారితే తప్ప ఆయనకు మంచి రోజులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.