అదో గ్రామ సచివాలయ కార్యాలయం. హఠాత్తుగా ఉన్నతాధికారి పరిశీలనకు వచ్చారు. అక్కడ స్పందనలో వచ్చిన ఓ ఫిర్యాదును పరిష్కరించలేదని అప్పటికప్పుడు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. అక్కడ ఒక్క చోటే కాదు.. అన్ని చోట్లా ఆలస్యంగా వచ్చారని.. పంచ్‌లు కొట్టలేదని.. సెలవులు ఎక్కువగా పెట్టారని.. ఇలా వరుసగా సస్పెన్షన్లు చేస్తూ పోతున్నారు. గత నెల రోజుల కాలంలోనే గ్రామ, వార్డు సచివాలయాల్లో కొన్ని వందల మందిని సస్పెండ్ చేశారు. దానికి కారణాలు మాత్రం చాలా చిన్న చిన్నవి. దీంతో గ్రామ, సచివాలయ ఉద్యగుల సంఘం ఇలా చేయవద్దని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.
ఏపీ ప్రభుత్వం ఈ నెల వచ్చేనెలలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరికీ ప్రొబేషన్లు ప్రకటించాల్సి ఉంది. ఇది గత అక్టోబర్‌లోనే చేయాల్సి ఉన్నప్పటికీ పరీక్షల పేరుతో వాయిదా వేస్తూ వస్తున్నారు. పరీక్షలు పెట్టే అందర్నీ ఉద్యోగంలోకి తీసుకున్నారు. మళ్లీ పరీక్షల్లో పాస్ అయితేనే ప్రొబేషన్ ఇస్తామని ముందు చెప్పలేదు. అయినప్పటికీ మళ్లీ పరీక్షలు పెట్టారు. చాలా మంది పాస్ కాలేదని.. అందరూ పాస్ అయిన తర్వాత అందరికీ ఒకే సారి ఇస్తామని చెబుతూ పాస్ అయిన వాళ్లనూ పక్కన పెట్టేశారు.
ఇప్పుడు వీలైనంత మందిని తగ్గించుకునేందుకు మరుగుదడ్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం దగ్గర్నుంచి చాలా పనులు చేయిస్తున్నారు. చేయకపోతే సస్పెండ్ చేస్తున్నారు. వారికి ప్రొబేషన్ ప్రకటించే లోపు ఇంకా ఎన్ని ఎన్ని ఒత్తిళ్లకు గురి చేస్తారోనని ఆ ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ప్రభుత్వానికి ఇది భావ్యం కాదంటున్నారు. కానీ వారి గోడు వినిపించుకునేదెవరు. .?