వైసీపీ అధినేత, సీఎం జగన్ తన ప్రత్యర్థులుగా తేల్చేసుకున్న దుష్టచతుష్టంలో ఉన్న ఆంధ్రజ్యోతి ఆర్కే ఈ విషయాన్ని ప్రివిలేజ్‌గా తీసుకుంటున్నారు. ఎంతగా అంటే.. నేరుగా రాజకీయ నేతను అని జగన్ అనుకుంటున్నారు కాబట్టి తాను కూడా ఆ స్థాయిలోనే సవాళ్లు చేస్తున్నారు. తాజాగా ప్రతి వారాంతం రాసే కొత్త పలుకు ఆర్టికల్‌లో నేరుగా జగన్‌కే సవాల్ చేశారు. జగన్ మంచి చేస్తున్నారో.. చెడు చేస్తున్నారో.. తాము తప్పుడు ప్రచారం చేస్తున్నామో నిజాలు చెబుతున్నామో తేల్చుకునేందుకు ఏబీఎన్ స్టూడియోలో చర్చకు రావాలని సవాల్ చేశారు. ఈ వారం కొత్తపలుకులో ఈ సవాలే హైలెట్.
ఓ పత్రికాధిపతి .. సీఎంను సవాల్ చేయవచ్చా.. ఆయన స్థాయేంటి అని కొంత మంది నీలిగే చాన్స్ లేకుండా ఆర్కే తన సవాల్లో అర్థముందని నేరుగానే చెప్పారు. సీఎం జగనే నేరుగా.. తన ప్రత్యర్థిగా ఆర్కేని పేర్కొనడమే.. ఆయన నేరుగా చర్చకు రావడానికి సరిపోతుందని.. ఇక ఆలస్యంగా జగన్దేనన్నట్లు సంకేతాలు పంపించారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి స్పందించడం కష్టం కానీ.. ఆర్కే చేసిన సవాల్ మాత్రం ప్రజల్లోకి వెళ్లిపోతుంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంత వరకూ ఒక్క ప్రెస్ మీట్‌ను కూడా ఎదుర్కోలేదు. ఆయన నేరుగా మాట్లాడటం కూడా కష్టమైపోతోంది. రికార్డు చేసిన వీడియోల్లోనే ఎన్నో బ్లూఫర్స్ బయటపడుతూ ఉంటాయి.చూసి చదివే దాంట్లో కూడా సింధూపురం, గుండూరు అంటూ అందరికీ తెలిసిన ఊరి పేర్లను కూడా తప్పుగా చదవుతుంటారు. ఇక నేరుగా చర్చ అంటే అసలు కనీసం అలాంటి ఆలోచన కూడా చేయరని ఆర్కే నమ్మకం. వైసీపీలోనూ అలాంటి నమ్మకమే ఉంది. ఆయన నేరుగా ఎవరితోనూ చర్చకు వెళ్లే చాన్స్ లేదు. అయితే ఆయన ఆర్కే చేస్తోంది తప్పు అని నిరూపించాలనుకుంటే చర్చకు వస్తారని.., లేకపోతే ఆయన రారని కౌంటర్లు, సెటైర్లు పడే అవకాశం ఉంది.
ఆర్కే తన కొత్తపలుకులో ఎప్పట్లాగే జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. జగన్ బాడిలాంగ్వేజ్, మొహంలో కనిపిస్తున్న ముఖ కవళికుల్లో జగన్‌లో పరాజయ భయాన్ని ఆర్కే చూస్తున్నారు. రాష్ట్రాన్ని నాశనం చేశారని ఉదాహరణలు చెప్పారు. అయితే ఈ సారి ప్రశాంత్ కిషోర్ కోణంలో చెప్పారు. పీకే లాంటి వాళ్లు కృత్రిమంగా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి చేయిస్తున్న రాజకీయాల వల్ల దేశం నాశనమైపోతోందని.. కేసీఆర్ లాంటి రాజకీయ చాణక్యులుగా పేరు తెచ్చుకున్న వారు కూడా ఆయన ప్రభావానికి లోను కావడం అంటే… రాజకీయాల రూపం మారిపోయినట్లేనని ఆర్కే చెబుతున్నారు.