అప్పులకు అనుమతి ఇవ్వకుండా అన్ని రాష్ట్రాలను కేంద్రం తన గుప్పిట్లో పెట్టుకుంది. అప్పుల మీదే ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఇది ఇబ్బందికరమే అయినా… వెంటనే వెళ్లి కాళ్లా, వేళ్లా పడి అప్పులకు అనుమతి తెచ్చుకునే ఓ వ్యవస్థను అక్కడి ప్రభుత్వం రెడీ చేసుకుంది. దీంతో కాస్త బెట్టు చేస్తున్నా.. చివరికి అనుమతి ఇస్తోంది. ఆ అప్పులు తెచ్చుకుని మీటలు నొక్కడమో.. జీతాలు, పెన్షన్లు చెల్లించడమో చేస్తున్నారు. అయితే తెలంగాణకు మాత్రం అలాంటి అవకాశం ఇవ్వడం లేదు. కొత్త ఆర్థిక సంవత్సరం వచ్చినా.. తెలంగాణ ప్రభుత్వానికి కొత్త అప్పులు చేసేందుకు కేంద్రం పర్మిషన్ ఇవ్వలేదు.
గత రెండు నెలల్లో ఏపీ ప్రభుత్వం దాదాపుగా రూ. పదకొండు వేల కోట్ల వరకూ అప్పులకు అనుమతి తెచ్చుకుంది. కానీ ప్రభుత్వం ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. తప్పుడు లెక్కలు ఇస్తే వాటిని కేంద్రం వెనక్కి పంపేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.అయినా కేంద్రం అప్పులకు పర్మిషన్ ఇచ్చింది. కానీ తెలంగాణ అప్పులపై పెద్దగా వివాదాల్లేవు. కార్పొరేషన్ల పేరుతో రాజ్యాంగ విరుద్ధంగా పన్నుల ఆదాయాన్ని తరలించే ప్రయత్నాలు చేయలేదు. అన్ని అప్పుల లెక్కలు పారదర్శకంగా చెప్పామని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. కానీ అప్పులకు అనుమతి మాత్రం దక్కడం లేదు.
ఈ నెలలో కూడా తాజాగా ఏపీకి మరో మూడు వేల కోట్లకు అనుమతి ఇచ్చారు కానీ.. తెలంగాణ విషయం పట్టించుకోలేదు. రాజకీయంగా వైసీపీతో బీజేపీకి సాన్నిహిత్యం ఉంది. కానీ టీఆర్ఎస్తో వైరం ఉంది. ఆర్థిక సమస్యల కారణంగా తెలంగాణ సర్కార్ చేయాల్సినవి చేయలేకపోతే ప్రజావ్యతిరేకత పెరుగుతుంది. బీజేపీ కోరుకునేది కూడా అదే. అదే ఏపీలో అయితే … తమకు వచ్చే లాభం ఏమీ ఉండదు. పైగో మిత్రోం వైసీపీ ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో అనుమతులు ఇస్తున్నట్లుగా భావిస్తున్నారు. మొత్తంగా అప్పుల విషయంలో కూడా రూల్స్ గీల్స్ జాన్తానై… మిత్రులకు.. వ్యతిరేకులకు రూల్స్ మారిపోతాయని కేంద్రం నిరూపిస్తోంది.