పొత్తు ఏదైనా ప్రజలకు ఉపయోగపడాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్ర పరిస్థితి దిగజారిపోతుందని, ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని పవన్ స్పష్టంచేశారు. నంద్యాల జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను ఓదార్చేందుకు యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నేరుగా పొత్తుల చర్చలకు పిలిస్తే చూద్దామన్నారు.
ఏపీ భవిష్యత్ కోసం చాలామంది కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓట్లు చీలిపోతే ప్రజలకు నష్టం జరుగుతుందని, పొత్తులపై చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఏపీ నిర్మాణానికి అందరూ తోడ్పడాలని సూచించారు. అయితే బీజేపీతో జనసేన పొత్తులో ఉందని, బీజేపీతో తమ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. మోదీ, అమిత్ షా అంటే తనకు గౌరవం ఉందన్నారు. రోడ్ మ్యాప్ పై సరైన సమయంలో స్పందిస్తామని ప్రకటించారు.
వైసీపీని ఎదుర్కొనేందుకు ప్రజా ఉద్యమం చేయాల్సి ఉందని అందరూ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమానికి టీడీపీ నేతృత్వం వహిస్తుందన్నారు. అవసరమైతే త్యాగాలకు సిద్ధమన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పవన్ నోట వెంట కూడా అలాంటి మాటలే వినిపించడం చర్చనీయాంశం ్వుతోంది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమన్న అభిప్రాయం బలపడుతోంది.