పదవుల్లో ఉన్నప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా బండ బూతులతో రెచ్చిపోయిన కొందరు ఇప్పుడు నోరు తెరవకపోవడంతో జగన్ ఫీలవుతున్నారని వైసీపీలో చర్చ జరుగుతోంది. వారిని ఎలాగోలా సముదాయించి మళ్లీ బూతుల ప్రవాహాన్ని పెంచేలా చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇందు కోసం ఎవరికీ అపాయింట్ మెంట్లు ఇవ్వకపోయినా వారిని మాత్రం పిలిచి మాట్లాడుతున్నారని తాడేపల్లిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి పదవులు పోయిన కొందరు.. మంత్రి పదవులు వస్తాయని కొందరు… మంత్రి పదవులు నిలబెట్టుకునేందుకు కొందరు అప్పట్లో తెలుగుదేశం పార్టీపైనా.. ఆ పార్టీ అధ్యక్షుడిపైనా.. జగన్ మనసు మెప్పించేలా బూతులతో విరుచుకుపడేవారు.
అలా మాట్లాడటం వల్ల ఆ పార్టీ తమను వ్యక్తిగత శత్రువులుగా చేసుకుంటుందని రాజకీయ పరిస్థితులు మారితే తమ పరిస్థితి దుర్భరంగా మారుతుందని తెలిసినా .. జగన్ కళ్లల్లో ఆనందం కోసం అలాంటి కామెంట్లు చేసేవారు. మంత్రివర్గ విస్తరణ చేసే వరకూ అవి జోరుగా సాగాయి. కానీ ఇప్పుడు అలాంటి వాయిస్లు ఎక్కువగా వినిపించడం లేదు. దీంతో జగన్ ఫీలయ్యారు. పిలిచి మళ్లీ గెలిస్తే మంత్రి పదవి అని ఆశ పెడుతున్నారు. గతంలోలా మాట్లాడాలంటున్నారు. మాట్లాడతారో లేదో కానీ ఇప్పటికైతే.. చాలా మంది తమ భవిష్యత్ ఏమిటని మథనపడుతున్నారు.
అధికారం మారితే తాము అన్న మాటలకు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనన్న ఆందోళన చాలా మందిలో ఉంది. అందుకే కొంత మంది సైలెంట్ అయ్యారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా వంద మందితో సూసైడ్ బ్యాచ్ తయారు చేసుకున్నామని ఎవరైనా ఇక నోరు జారితే.. చంపడమో.. చావడమో చేస్తామని చెబుతున్నారు. ఈ పరిణామాల మధ్య జగన్ గతంలోలా.. చంద్రబాబును ఆయన కుటుంబాన్ని గట్టిగా తిట్టే వారి కూడా చూస్తున్నారు. ఈ పాత్రల్లోకి ఇప్పుడు ఎవరొస్తారో చూడాలి.