భారతీయ జనతా పార్టీకి రాష్ట్రపతి ఎన్నికలు కీలకంగా మారాయి. ఆ పార్టీకి కానీ ఎన్డీఏకు కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకునే బలం లేదు. కొంత తక్కువయింది. ఆ కొంత తీర్చే బలం వైసీపీ దగ్గర ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు.. లోక్‌సభ, రాజ్యసభ కలిపి 28 మంది ఎంపీలు కలిసిన ఓట్లు బీజేపీ అభ్యర్థికి ఉపయోగపడతాయి. బీజేపీని కాదని వేరే వారికి వైసీపీ మద్దతు ప్రకటించే అవకాశం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఈ బలాన్ని వైసీపీ ఎలాంటి రాష్ట్ర ప్రయోజనాలకు వాడుకుంటుందనే విషయంపై ప్రజల్లోనూ ఆసక్తి ఏర్పడింది. ప్రత్యేకహోదా తెచ్చేస్తారా ? అన్న చర్చ కూడా ప్రారంభమయింది.
రాష్ట్రపతి ఎన్నికను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీలో 10,98,903 ఓట్లు ఉండగా, బీజేపీకి 4,65,797 ఓట్లు, మిత్ర పక్షాలకు 71,329 ఓట్లు ఉన్నాయి. మొత్తం 5,37,126 ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి లభిస్తాయని, అయినప్పటికీ 9,194 ఓట్లు తక్కువయ్యే అవకాశం ఉంది. ఈ ఓట్లలో చాలా వవరకూ వైసీపీ కవర్ చేయగలదు. ఆ తర్వాత మరో బీజేపీ అప్రకటిత మిత్రపక్షం బిజూ జనతాదళ్ ఉండనే ఉంది. త్వరలో కేంద్రమంత్రులు వైసీపీతో రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ కోసం రానున్నారు. ఆ చర్చల్లో సీఎం జగన్ ఏపీ ప్రయోజనాల కోసం మాట్లాడతారని భావిస్తున్నారు.
ఇప్పటి వరకూ కేంద్రానికి.. కేంద్రం బిల్లలకు వైసీపీ ఎన్నో సార్లు మద్దతిచ్చింది. వ్యవసాయ బిల్లులకు, సీఏఏ – ఎన్నార్సీ బిల్లలకూ మద్దతిచ్చింది. చెప్పాలని చూస్తే ఏ ఒక్క దాన్నీ వ్యతిరేకించలేదు. రాజకీయంగా కూడా ఏపీకి సంబంధం లేకపోయినా బీజేపీని సంతృప్తి పర్చడానికి కాంగ్రెస్‌పై ఎటాక్ చేస్తున్నారు. అయితే ఇవన్నీ తమపై ఉన్న కేసుల బారి నుంచి బయటపడటానికే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ సారి అయినా ఓ ప్రయత్నం జగన్ చేస్తారని ప్రజలు ఆశపడుతున్నారు.