వైసీపీలో రాజ్యసభ టిక్కెట్ల రేస్ రసవత్తరంగా సాగుతోంది. పోటీ దారులు అంతకంతకూ పెరిగిపోతున్నారు. ఈ పోటీ దారులు వైసీపీ కోసం కష్టపడిన నేతలు కాదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్లో గళమెత్తే వారు కాదు. సొంత ప్రయోజనాలు చూసుకునే పారిశ్రామికవేత్తలు. వైసీపీ రాజ్యసభ సీట్లు అంటే పారిశ్రామికవేత్తల కోసమేనన్నట్లుగా సీన్ మారిపోయింది. గతంలో రిలయన్స్ కోటాలో పరిమిళ్ నత్వానీకి రాజ్యసభ సీటిచ్చారు. ఆయన ఏపీ కోసం ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు అదానీ కోటాలో గౌతమ్ అదానీ భార్యను రాజ్యసభకు పంపడానికి రంగం సిద్ధమయిందని చెబుతున్నారు.
మొత్తం నాలుగుకి నాలుగు వైసీపీకే దక్కుతాయి. ఒకటి అదానీ కోటాకు వెళ్తే .. మిగతా మూడు పార్టీ నేతలకు ఇస్తారేమో అనుకుంటున్నారు. కానీ ఆ మూడింటి కోసం చాలా పెద్ద స్థాయిలో పారిశ్రామిక వేత్తల నుంచి జగన్కు ఒత్తిళ్లు వస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ నుంచి మైహోం రామేశ్వరరావు కూడా వైసీపీ తరపున రాజ్యసభకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కావాలంటేతాను వైసీపీలో చేరడానికి సిద్ధమని ఆయన చెబుతున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఆయనతో పాటు జగన్కు పారిశ్రామికరంగం చాలా కాలంగా ఆప్తులుగా ఉండటమే కాదు బంధుత్వం కూడా ఉన్న హెటెరో పార్థసారధి రెడ్డి లాంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
జగన్కు సన్నిహితులైన పారిశ్రామికవేత్తలు చాలా మంది ఉన్నారు . వారంతా ఏదో విధంగా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు. గతంలో టీటీడీ బోర్డు లాంటి దాంట్లోనే చోటు కోసం వచ్చిన ఒత్తిళ్లు తట్టుకోలేక.. జీవో తెచ్చి మరీ వంద మందికిపైగా అందులో సభ్యత్వం ఇచ్చారు. ఇక రాజ్యసభ సీటు కోసం ఎంత వత్తిడి వస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజ్యసభ సీట్లను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ పార్టీ అయినా భర్తీ చేస్తుంది.. కానీ వైసీపీ స్టయిలే వేరు