‘ఎఫ్ 2’ అందించిన వినోదం అంతా ఇంతా కాదు. ఆ సినిమా చూస్తున్నంతసేపూ నవ్వుతూనే ఉంటాం. అనిల్ రావిపూడి మ్యాజిక్ అది. ఇప్పుడు దాన్నే నమ్ముకొని ఎఫ్ 2కి సీక్వెల్ గా ఎఫ్ 3 తీశారు. అవే పాత్రలు.. అవే క్యారెక్టరైజేషన్లు … దాంతో పాటు.. అంతకు మించిన కామెడీ ఇస్తామని – చిత్రబృందం ముందు నుంచీ చెబబుతూనే ఉంది. ట్రైలర్ చూస్తే.. అది నిజమే అనిపిస్తోంది. ఎఫ్ 2లో ఎలాంటి ఫన్ బేస్ వేసుకుంటూ వెళ్లి, వినోదం పంచాడో, ఎఫ్ 3లోనూ అదే చేశాడు. వెంకీ ఆసన, అంతేగా – అంతేగా, అనే మేనరిజాలు కంటిన్యూ అయినా, కొత్త తరహా క్యారెక్టరైజేషన్లతో ఫన్ డోస్ పెంచాడు.
”ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు ఐదు. కానీ ఆరో భూతం ఒకటి ఉంది.. అదే డబ్బు. అది ఉన్న వాడికి ఫన్నూ.. లేనివాడికి ఫస్ట్రేషనూ..”
– అనే మురళీ శర్మ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక అక్కడి నుంచి ఫన్ మొదలైపోయింది.
మనీ ప్లాంట్ బిరియానీ, మనీప్లాంట్ చారు, మనీప్లాంట్ వేపుడూ అంటూ.. అల్లుడికి డబ్బులు బాగా రావాలని మనీ ప్లాంట్ తోనే వంట చేసే కుటుంబం.. వాళ్ల అల్లరి..
”వాళ్లది పెద్ద మాయల మరాఠీ ఫ్యామిలీ.”
”వాళ్లది మరాఠీ ఫ్యామిలీ అయితే మాది దగ్గుపాటి ఫ్యామిలీ…”
”వాళ్లది పెద్ద దగా ఫ్యామిలీ.”
”వాళ్లది దగా ఫ్యామిలీ అయితే.. మాది మెగా ఫ్యామిలీ…” అంటూ వెంకీ, వరుణ్‌లతో చెప్పించడం బాగుంది.
వెంకీ రేచీకటిని ఫన్‌కి బాగా వాడుకున్నట్టు అర్థమవుతోంది. `చీకట్లో ఎన్ని పాపాలు చేసి చచ్చావో.. నాకు రేచీకటి వచ్చింది` అంటూ నాన్నని ఆడిపోసుకోవడం, ఫొటో చూపించకుండానే `సూపర్, ఎక్సార్డనరీ, అదిరిపోయిందిగా` అనడం.. ఇదంతా బాగా వర్కవుట్ అయ్యాయి.
అంతేగా. అంతేగా…
అన్నప్పుడు `వీడికి సీక్వెల్ లో కూడా సేమ్ డైలాగా` అంటూ.. రఘుబాబు కౌంటర్ ఇవ్వడం నవ్వులు పూయించేలా చేసింది. మొత్తానికి రెండున్నర నిమిషాల ఈ ట్రైలర్… ఆద్యంతం వినోదం పంచిపెట్టింది. థియేటర్లో కూడా ఇంతే ఫన్నుంటే… ఈ వేసవిలో ఓ సూపర్ హిట్. ఎఫ్ 3 ఖాతాలో చేరిపోవడం ఖాయం.