నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎంపీ అర్వింద్ వర్సెస్ మాజీ ఎంపీ కవిత రాజకీయ పోరాటం పీక్స్‌కు చేరిపోయింది. కవిత మళ్లీ నిజామాబాద్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారేమో కానీ ఇంత కాలం ఎంపీ అర్వింద్‌ను పెద్దగా పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు మాత్రం ఆమె దూకుడు మీద ఉన్నారు. పసుపు బోర్డు దగ్గర్నుంచి ప్రతి వైఫల్యంపైనా దృష్టి పెడుతున్నారు. కవిత రాజకీయ దాడుల్ని అర్వింద్ కూడా సీరియస్‌గా తీసుకున్నారు. ప్రతి విమర్శలు గుట్టిగానే చేస్తున్నారు.
వీరిద్దరి పోరాటంలోకి కొత్తగా రైతులు వచ్చారు. రైతుల కేంద్రంగానే వీరి సవాళ్లు.. ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చినందున అర్వింద్ రాజీనామా చేయాలని… పసుపు రైతుల పేరుతో టీఆర్ఎస్ నేతలు అర్వింద్ ఇంటి ముందు పసుపు పోసి నిరసనలు ప్రారంభించారు. అర్వింద్ అనుచరులు కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ధాన్యం రాశుల్ని తెచ్చి కవిత ఇంటి ముందు పోసి.. ధాన్యం కొనుగోళ్లపై విమర్శలు చేస్తున్నారు. ఇలా ఒకరి ఇళ్ల ముందు ఒకరు పసుపు, ధాన్యాల్ని పారబోసి ధర్నాలు చేయిస్తున్నారు.
తెలంగాణలో మరే నియోజకవర్గంలోనూ ఈ పరిస్థితి లేదు. నిజామాబాద్‌లో తన పరపతిని పెంచుకోవాలనుంటున్న కవిత పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. కానీ ఎలాగైనా తన ప్రభావాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న అర్వింద్ మాత్రం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో రాజకీయ పోరాటం రసవత్తరంగా మారింది.