కేంద్రం రుణ పరిమితిపై తేల్చకపోవడంతో తెలంగాణ సర్కార్కు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికీ జిల్లాల్లో చాలా మంది ఉద్యోగులకు జీతాలు అందలేదు . కొత్తగా ఈ నెలలో రైతు బంధు పథకాన్ని అమలు చేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం వద్ద నిధులు లేవు. వ్యవసాయ, ఆర్థిక శాఖలు ప్రస్తుత సీజన్లో మొత్తం రూ. 7,600 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అంతే ఇంత పెద్ద మొత్తంలో సమకూర్చుకోవడం కష్టంగా మారింది. పథకం ప్రతీ సారి ఆలస్యం అవుతోంది. ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది.
2018లో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టినపుడు.. మే నెలలోనే చెక్కులు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఆలస్యమవుతూ వస్తోంది. ఈ సారి కూడా మే నెలలో ఇవ్వలేకపోతున్నారు. వచ్చే నెలలోనే ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కకాలంలో నిధులు సర్దుబాటు చేయటానికి ఆర్థిక శాఖ ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలోనే గత రెండు విడతల్లో చేసినట్లుగానే.. వారం పది రోజుల వ్యవధి తీసుకొని రోజుకో ఎకరం చొప్పున పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో నిధులు వేయనున్నారు. అందుకు అనుగుణంగా డేటాను వర్గీకరిస్తున్నారు.
తొలుత ఎకరం, రెండెకరాలు, మూడెకరాలు, నాలుగెకరాలు… ఇలా 10 ఎకరాల వరకు పది విడతలుగా నిధులు జమ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులను కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చనున్నారు. అందరికీ ఇవ్వాలని ఉన్నా.. నిధుల సమస్యతో ఎప్పటికి ఖాతాల్లో జమ అవుతాయో మాత్రం చెప్పడం కష్టమన్నట్లుగా పరిస్థితి మారడం రైతుల్లోనూ .. టీఆర్ఎస్ నేతల్లోనూ ఆందోళనకు కారణం అవుతోంది.