ఏపీ బీజేపీలో సీన్ మారిపోతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఆయనను అధికారికంగా తొలగించకపోయినా ఇక ఆయన పాత్రను నామమాత్రం చేయాలన్న సూచనలు ఢిల్లీ నుంచి ఏపీ బీజేపీ నేతలకు అందినట్లుగా తెలుస్తోంది. కన్నా లక్ష్మినారాయణ ఒక్క సారిగా యాక్టివ్ అయ్యారు. కన్నా ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్నారు. ఏపీ నుంచి ఆయన ఒక్కరే ఢిల్లీ స్థాయి నేత. ఆయన తాజాగా తన బృందాన్ని తీసుకుని గవర్నర్ను కలిశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ మతం, హిందూ దేవాలయాలపై దాడులు జరిగినా ఎక్కడా పోలీస్ యాక్షన్ తీసుకోలేదని, రాష్ట్రంలో మతమార్పిడులు విచ్చల విడిగా జరుగుతున్నాయి అని ఫిర్యాదు చేశారు.
నెల్లూరులో హనుమాన్ జయంతి శోభాయాత్రపై అటాక్ చేశారు ,ఆత్మకూరు లో హిందూ ఏరియాలో మసీదు కడుతున్నారని అడిగితే వారి పై దాడి చేశారు ,తెనాలి లో హిందూ మహిళని వేదిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు,శ్రీశైలం లో అన్యమత మతస్తులు అత్యధికంగా దుకాణాలు, ఇతరత్రా కలిగి ఉన్నారని నిరూపించినా చర్యలు లేవని బీజేపి నాయకులు తెలిపారు. సాధారణంగా గవర్నర్ను కలవాలంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నేతృత్వంలో వెళ్తారు. ఈ సారి సోము వీర్రాజును పక్కన పెట్టి కన్నా నేతృత్వంలో కలిశారు. సోము వీర్రాజు తీరుపై బీజేపీ హైకమాండ్ ఆగ్రహంతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. గతంలో అమిత్ షా వచ్చినప్పుడు పొత్తులపై మాట్లాడవద్దని స్పష్టమైన సూచనలు చేశారు.
అయినా సోము వీర్రాజు జిల్లాలు తిరుగుతూ పొత్తులపై రకరకాల కామెంట్లు చేస్తూ… తాను కూడా సీన్లో ఉన్నానని మీడియా దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. పొత్తులపై మాట్లాడిందే తప్ప.. వేరేది ఏం మాట్లాడినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆయన తీరుపై ఇప్పటికే బీజేపీలోని ఓవర్గం రగిలిపోతోంది. వైసీపీ కోసం ఆయన పని చేస్తున్నట్లుగా ఉందని ఆరోపిస్తున్నారు. పొత్తుల విషయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా క్లారిటీకి వచ్చి ఆయనకు బదులుగా కన్నాను యాక్టివ్ అవమని సూచించినట్లుగా బీజేపీలోనే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి బయట పొత్తుల సంగతేమిటో కానీ ఏపీ బీజేపీలో మాత్రం జరగరానిదేదో జరుగుతోందన్న అభిప్రాయం మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది.