130 ఏళ్ల కిందట బ్రిటిష్ వాళ్లు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న భారతీయులపై కేసులు పెట్టడానికి ఏర్పాటుచేసుకున్న మార్గం రాజద్రోహం . దాన్ని ఇప్పటి ప్రభుత్వాలు కూడా అదే పనిగా ఉపయోగించుకుంటున్నాయి. తమ ప్రభుత్వాన్ని విమర్శించినా రాజద్రోహం , దేశ ద్రోహం కేసులు పెట్టే స్థాయికి దిగజారాయి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు రాజద్రోహం కేసులు అవసరమా లేదా అన్నదానిపై సుప్రీంకోర్టు కీలకమైన ఉత్తర్వులు ఇచ్చింది. ఆ కేసులను నిలుపుదల చేసింది. కేంద్రం పరిశీలన జరుపుతున్నామని చెప్పడంతో ఆ పరిశీలన పూర్తయ్యే వరకూ స్ేట ఇచ్చింది.
దేశవ్యాప్తంగా దాదాపుగా ఎనిమిది వందలకుపైగా దేశద్రోహం, రాజద్రోహం కేసులు ఉన్నాయి. వీటిలో అత్యధికం తమ ప్రభుత్వంపై కుట్ర పన్నారని ప్రభుత్వాలు నమోదు చేసినవే. ఆ కుట్రల్లో అత్యధికం ప్రజా పోరాటాల్లో పాల్గొన్నవే. లేకపోతే.. ప్రభుత్వాన్ని విమర్శించినవే. ఇటీవల ఓ తెలుగురాష్ట్రంలో ఓ ఎంపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీడియా సమావేశాలు పెడుతున్నారని ఆయనపైనా.. టీవీ చానళ్లపైనా రాజద్రోహం కేసులు పెట్టారు. ఇంత దారుణంగా రాజద్రోహం చట్టాన్ని దుర్వినియోగం చేస్తూండటంతో సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఎడిటర్స్ గిల్డ్ కూడా ఇలాంటి చట్టాలు వద్దని వాదిస్తోంది. చివరికి ఈ ప్రయత్నాలు ఫలించి రాజద్రోహం కేసులపై స్టే ఇచ్చింది.
ప్రజాస్వామ్యంసలో ప్రభుత్వాలపై విపక్షాలు పోరాటం చేస్తాయి. అవి చేసే పనులపై నిరంతరం ప్రశ్నించడం వాటిరాజ్యాంగ హక్కు. కానీ ప్రభుత్వాలు వాటిని తమపై కుట్రలు భావించి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నాయి. ఈ కారణంగా చట్టం విస్తృతంగా చర్చల్లోకి వచ్చింది. కొన్ని ప్రభుత్వాల తీరు వల్ల అసలు చట్టానికే ముప్పు వచ్చి పడింది. నిజానికి రాజద్రోహం లేదా దేశద్రోహం వంటి కేసులు ఇతర దేశాల వారితో కుమ్మక్కయి.. దేశానికి వ్యతిరేకంగా ఏదైనా కుట్రలు చేస్తే పెట్టడానికి ఉపయోగిస్తారు. అలాంటి వాటిని ఎవరూ కాదనరు కూడా. కానీ రాజకీయ అవసరాలే ఇప్పటి రాజకీయ పార్టీలకు .. దేశం కన్నా ముఖ్యమయ్యాయి. అందుకే ఆ చట్టం అదేపనిగా దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి దుర్వినియోగానికి చెక్ పడినట్లయిది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడినట్లయింది.