Sarkaru Vaari Paata review
తెలుగు360 రేటింగ్ 2.75/5
పెద్ద హీరో దొరగ్గానే… ఆరు పాటలు, నాలుగు ఫైట్లు, ఇంట్రడక్షన్లు, కొంచెం రొమాన్స్, కామెడీ అంటూ కొలతలేసుకునే రోజులు కావు. బలమైన కథ కావాలి. కనీసం పాయింట్ కొత్తగా ఉండాలి. అదీ లేకపోతే… సోషల్ మెసేజ్ అయినా కనిపించాలి. మహేష్ బాబు కొంతకాలంగా… ఆ `మెసేజ్`తోనే మానేజ్ చేస్తున్నాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి.. ఇవన్నీ… అలాంటి కథలే. వాటిలో కమర్షియల్ అంశాల్ని, హీరోయిజాన్నీ తెలివిగా బాలెన్స్ చేయడం వల్ల.. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈసారి బ్యాంకులు, వాటిని దోచుకుంటున్న పెద్ద మనుషులు… ఈ పాయింట్ ని ఎంచుకున్నాడు మహేష్. నిజానికి బలమైన కరెంట్ టాపిక్ ఇది. మరి.. దీన్ని మహేష్ శైలికి, తన క్రేజ్‌కి తగ్గట్టుగా పరశురామ్ ఎలా మలిచాడు? సర్కారు వారి పాటలో.. ఉన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమిటి? సందేశానికీ, కమర్షియాలిటీకి లింకు ఎలా కుదిరింది?
మహేష్ (మహేష్ బాబు) అమెరికాలో వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. అప్పు ఇచ్చాడంటే ముక్కు పిండి మరీ వసూలు చేయడం తనకు అలవాటు. అలానే… కళావతి (కీర్తి సురేష్)కీ అప్పు ఇస్తాడు. తను పైకి సరస్వతీదేవికి సిస్టర్లా కనిపిస్తుంది గానీ, లోపల గ్యాంబ్లర్. కాసినో పిచ్చిలో పడి… వేల డాలర్లు అప్పులు చేస్తుంటుంది. అందులో భాగంగానే… చదువుకోసమని, పరీక్షల కోసమని… మహేష్ దగ్గర అప్పు తీసుకుంటుంది. ముందు గుడ్డిగా నమ్మేసిన మహేష్.. ఆ తరవాత కళావతి నిజ స్వరూపం చూసి, తన బాకీ తీర్చమని నిలదీస్తాడు. `నీ బాకీ.. నేను తీర్చను.. ఏం చేసుకుంటావో చేస్కో` అని సవాల్ చేస్తుంది. కళావతి నాన్న రాజేంద్రనాథ్ (సముద్రఖని) విశాఖపట్నంలో అపర కోటీశ్వరుడు. రాజ్యసభ సభ్యుడు. రాజకీయంగా పెద్ద పలుకుబడి ఉంది. కూతురు చేసిన అప్పుని.. తండ్రి దగ్గర నుంచి వసూలు చేద్దామని.. అమెరికా నుంచి నేరుగా విశాఖపట్నంలోకి దిగిపోతాడు. `నీ కూతురు నా దగ్గర అప్పు చేసింది పది వేల డాలర్లే.. కానీ నువ్వు నాకు పది వేల కోట్ల రూపాయలు బాకీ తీర్చాలి..` అని మీడియా ముందే నిలదీస్తాడు. పది వేల డాలర్ల కోసం వచ్చిన మహేష్… పది వేల కోట్ల రూపాయల్ని ఎందుకు వసూలు చేయాలనుకున్నాడు? దాని వెనుక ఉన్న కథేమిటి? అనేది తెరపై చూడాలి.
“మన బ్యాంకుల వ్యవస్థ అంతా డొల్లే. వేలాది కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొన్న బడా బాబులు బాగానే ఉన్నారు, ఇంటి నిర్మాణం కోసమో, కూతుర్ల పెళ్లిళ్ల కోసమో అప్పులు చేసిన సగటు మధ్యతరగతి ప్రజల్ని… బ్యాంకులు నానా ఇబ్బందులు పెడుతున్నాయి. ముందు… విజయ్ మాల్యా లాంటివాళ్ల దగ్గర్నుంచి డబ్బు ముక్కు పిండి వసూలు చేయండి..“ ఇలాంటివి మనం రోజూ… వాట్సప్ ఫార్వర్డ్ మెసేజీలలో చదువుకున్న సందేశాలే. దాన్ని ఆసరాగా తీసుకొని ఓ కమర్షియల్ హీరోతో.. ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేశాడు పరశురామ్. చెప్పాలనుకున్న పాయింట్ బలమైనదే. అందులో పాటలు, ఫైట్లు, హీరోయిన్ తో రొమాన్స్ లాంటి కమర్షియల్ అంశాల్నీ బాగానే పొందిగ్గా రాసుకున్నాడు. చిక్కల్లా ఎక్కడంటే.. వీటి కలబోతే.. సరిపోలేదు. పార్టులు పార్టులుగా చూసినప్పుడు సీన్లు బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ.. మొత్తం చూస్తే.. బ్యాంకు వ్యవస్థలో ఉన్న డొల్లతనమే, కథ… కథనాల్లో కనిపిస్తుంది.
మహేష్ చిన్నప్పటి ఎపిసోడ్ తో కథ మొదలవుతుంది. పదిహేను వేలు అప్పు తీర్చలేక.. మహేష్ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. అప్పటి నుంచీ.. ప్రతి రూపాయికీ విలువ ఇస్తూ.. డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకుంటాడు హీరో. నిజానికి అప్పుల ఊబిలో కూరుకుపోయి కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే.. హీరో.. అప్పు తీసుకోకూడదు, లేదంటే అప్పు ఇవ్వకూడదు అనే పంథాలో సాగాలి. కానీ ఇక్కడ రివర్స్.. అమెరికా వెళ్లి మరీ అప్పులిస్తుంటాడు. పది వేల డాలర్ల అప్పు కోసం.. అమెరికా నుంచి… విశాఖపట్నం వరకూ వచ్చేస్తాడు. అదీ హీరో క్యారెక్టరైజేషన్. ఈ కథకీ.. ఆ క్యారెక్టరైజేషన్‌కీ ఏమాత్రం పొంతన కుదర్లేదు. మహేష్ ఇంట్రడక్షన్…. ఫైటు, ఆ వెంటనే పెన్నీ పాట.. ఇవన్నీ ఫ్యాన్స్‌ని అలరించే అంశాలే. కీర్తి సురేష్ తో లవ్ ట్రాక్ గురించి మహేష్ తో సహా.. అంతా గొప్పగా చెప్పారు. అంత గొప్పగా లేకపోయినా.. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఏమైనా ఉందంటే…అది ఈ లవ్ ట్రాకే. కథకు కీలకం కాబట్టి.. ఆ ఎపిసోడ్స్ ని బాగానే రాసుకున్నాడు దర్శకుడు. మహేష్ లో ఈజ్నీ, `బాయ్.. థింగ్`నీ ఈ ఎపిసోడ్స్ లో చూసే అవకాశం దక్కింది. ఎప్పుడైతే లవ్ ట్రాక్ అయిపోతుందో, అప్పుడు కథ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. హీరో.. బాకీ కోసం విశాఖపట్నం రావడం, ఇక్కడ సముద్ర ఖనికి వార్నింగ్ ఇవ్వడం.. బీచ్ ఫైట్ ఇవన్నీ మళ్లీ ఫక్తు కమర్షియల్ మీటర్లో సాగాయి. పది వేల కోట్లు.. అన్న చిన్న ట్విస్ట్ తో.. ఇంట్రవెల్ కార్డ్ వేశాడు.
ద్వితీయార్థంలో అసలు ఆ పదివేల కోట్ల కథేమిటి? అనేది చెప్పే ప్రయత్నం చేశారు. అది కూడా పెద్ద ట్విస్టు కాదాయె. ఎయిర్ పోర్ట్ లో… ఎప్పుడైతే నదియాని చూశారో, అప్పుడే ప్రేక్షకులు ఈ ట్విస్ట్ ని ఊహిస్తారు. సముద్రఖని చేత పది వేల కోట్లు ముక్కు పిండి వసూలు చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు ఇన్నోవేటివ్ గా ఉండవు. లారీ వేసుకెళ్లి.. వందల మందిని చెదరగొట్టడం.. సముద్రఖనికి నోటీసులు ఇవ్వడం ఫక్తు కమర్షియల్ గా సాగింది తప్ప.. హీరో తెలివి తేటల్ని చూపించలేకపోయాడు దర్శకుడు. అసలు ఈ కథలోనే పెద్ద లోపం ఉంది. తనది కాని.. విషయంలో హీరో తలదూర్చి… పోరాటం చేస్తున్నాడన్న విషయం ప్రేక్షకుడికి అర్థమవుతూనే ఉంటుంది. దాంతో.. ఆ క్యారెక్టరైజేషన్‌ని తప్ప, కథని ఫాలో అవ్వలేడు. బ్యాంకు తాళాలకు సీలు వేసి, తాళాల గుత్తి పట్టుకుని పెద్ద యుద్ధమే చేస్తున్నా.. ఏ ఎమోషనూ కలగదు. ముందు నుంచీ. నెగిటీవ్ గా కనిపించే హీరోయిన్ పాత్ర.. చివర్లో పాజిటీవ్ గా టర్న్ తీసుకోవడం కూడా.. `మ.. మ మహేషా` అనే మాస్ పాట కోసమే అని అర్థమవుతూనే ఉంటుంది. మహేష్ సుబ్బరాజుని బ్లాక్ మెయిల్ చేయడం, కీర్తి కాలిపై కాలేసుకుని పడుకోవడం.. ఇవన్నీ బీ, సీ సెంటర్లకు కాస్త ఊపు తీసుకురావొచ్చేమో గానీ.. టోటల్ గా అయితే.. హీరోయిన్ క్యారెక్టర్ని దిగజార్చడమే అవుతుంది. చివర్లో విలన్ పాత్రలో వచ్చే మార్పు కూడా.. మనసుకెక్కదు. టోటల్ గా చూస్తే.. అక్కడక్కడ మహేష్ పెర్ఫార్మెన్స్ తో.. లేస్తూ.. మధ్యలో కథలేమితో పడుతూ… అలా.. అలా సాగిపోయింది.. సర్కారు వారి పాట.
మరోసారి మహేష్ వన్ మాన్ షో చేశాడు. తన లుక్ కొత్తగా ఉంది. కాస్ట్యూమ్స్ అదిరిపోయాయి. ఈసారి డాన్సుల్లోనూ మెరిశాడు. పెన్నీ పాటలో స్టెప్పులు స్టైలీష్ గా ఉంటే, మ.. మ మహేషాలో మాసీగా ఉన్నాయి. చాలా రోజుల తరవాత పేజీల కొద్దీ డైలాగులు చెప్పాడు. తన మేనరిజం అభిమానులకు నచ్చేస్తుంది. ఈ సినిమాని కాపాడే ప్రధాన ఎలిమెంట్ కూడా అదే. కీర్తి ఈ తరహా పాత్ర ఇప్పటి వరకూ చేయలేదు. తన పాత్రలో కాస్త నెగిటీవ్‌గానే ఉంటుంది. కానీ… తొలి సగంలో.. ఈ సినిమాలో కామెడీ పండడానికి ఆ పాత్ర కారణమైంది.సముద్రఖని నటన మరోసారి ఆకట్టుకుంటుంది. వెన్నెల కిషోర్ ఫస్టాఫ్ లో కాస్త నవ్వులు పంచుతాడు. నదియాకు ఈసారి చిన్న పాత్రే పడింది.
కళావతీ.. పాట ఆల్బమ్ లో సూపర్ హిట్. తెరపైనా ఆ పాట బాగుంది. మంచి ప్లేస్మెంట్ లో పడింది. పాటల విషయంలో న్యాయం చేసిన తమన్… ఈసారి బ్యాక్ గ్రౌండ్ విషయంలో.. నిరాశ పరిచాడు. సన్నివేశాల్ని తన ఆర్.ఆర్.. చాలా డామినేట్ చేసేసింది. మది కెమెరాపనితనం బాగుంది. తెరపై కాసులు కుమ్మరించిన విషయం ప్రతీ షాట్ లోనూ కనిపిస్తోంది. పరశురామ్ రాసుకున్న కథ తేలిపోయింది. సన్నివేశాల్లో కొత్తదనం కనిపించలేదు. కేవలం మహేష్ క్యారెక్టరైజేషన్‌ని నమ్ముకుని తీసిన సినిమా ఇది. అదే… సర్కారు వారి పాటకు శ్రీరామ రక్ష.
కాసేపు మహేష్ ని చూస్తే చాలు. మహేష్ నిలబడి నాలుగు డైలాగులు చెబితే చాలు… అనుకునేవాళ్లకు ఈ సర్కారు వారి పాట నచ్చుతుంది. మిగిలిన వాళ్లకు ఈ సినిమా `జస్ట్… ఓకే` అనిపిస్తుంది.
తెలుగు360 రేటింగ్ 2.75/5