కోర్టులో దొంగతనం జరిగింది. కేవలం ఓ బీరువాలో ఫైల్స్ తీసుకెళ్లారు. దానికి నెల్లూరు ఎస్పీ విజయారావు చెప్పిన కథను అందరూ రిజెక్ట్ చేశారు. కనీసం సీఐడీ సీరియల్లో ఓ పార్ట్‌గా తీసేంత సరుకు కూడా లేదని.. మొత్తం లోపాలే ఉన్నాయని తేల్చారు. ఎస్పీ చెప్పిన కథపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడిచింది. ఆ కథను కోర్టు.. న్యాయమూర్తి కూడా నమ్మలేదు.. అది వేరే విషయం. ఇప్పుడు నారాయణ ను అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇవే కథలు వినిపించారు.
రిమాండ్ రిపోర్టును చూస్తే పోలీసులు ఇంత అమాయకంగా దొంగ కేసులు పెడతారా అని ఎవరైనా ఆశ్చర్యపోయే పరిస్థితి. నారాయణను అరెస్ట్ చేయడానికి కేసు పెట్టడానికి కారణం.. నిందితులు ఇచ్చిన వాంగ్మూలం. ఆ నిందితులందరూ ఒకటే వాంగ్మూలం ఇచ్చారు. అందరితోనూ జరిగింది అదే కాబట్టి అలా ఇచ్చారని చెప్పుకోవచ్చు. కానీ చైతన్య కాలేజీ ప్రిన్సిపల్‌కు కూడా నారాయణే ఆదేశాలిచ్చారని.. ఆయనే నారాయణ కాలేజీ గ్రూప్ లో పోస్ట్ చేశారని చెప్పారు. దాన్ని పోలీసులు రాసుకున్నారు. ఇలాంటి విచిత్రాలు ఎఫ్ ఐఆర్ నిండా ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసులోనూ పోలీసులు శీల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
నేరం చేసిన వారు ఎప్పటికైనా బయటపడతారు.. శిక్షింపబడతారు.. ఇది పోలీస్ శాఖలో బాగా నమ్మే విషయం. ఇది పోలీసు పెద్దలకు తెలియని విషయం కాదు. తాము తప్పు చేసినా ఎప్పటికైనా దొరికిపోతారు. కాకపోతే ఇప్పుడు తప్పొప్పులు తేల్చే డ్యూటీలో ఉన్నారు కాబట్టి బయటకు రావు.. రేపు కొత్త వారొస్తే అప్పుడు బయటకు వస్తాయి. అప్పుడు పోలీసులు కాస్తా నేరస్తులవుతారు. భవిష్యత్ ఉన్న ఐపీఎస్‌లు కూడా కుట్ర కేసుల్లో ఇరుక్కుపోతారు. భవిష్యత్‌లో ఇలాంటి ఎన్నో పరిణామాలకు ప్రస్తుత కేసులు సాక్ష్యాలుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇది విషాదమే.. !