తెలంగాణ రాష్ట్ర సమితి హైదరాబాద్ జిల్లా శాఖకు కార్యాలయం అవసరం వచ్చింది. హైదరాబాద్లోనే కేంద్ర పార్టీ ఆఫీస్ ఉందిగా.. ఇంకెందుకు కార్యాలయం అనే డౌట్ ఎవరికైనా రావొచ్చు కానీ టీఆర్ఎస్ నేతలకు మాత్రం రాలేదు. వారు వెంటనే హైదరాబాద్ కలెక్టర్కు దరఖాస్తు చేసుకున్నారు. హైదరాబాద్ టీఆర్ఎస్ ఆఫీసుకు కార్యాలయం లేకపోవడం అవమానమనుకున్న ఆయన కూడా వెంటనే.. అత్యంత ఖరీదైన ప్రాంతంలో బహిరంగ మార్కెట్లో దాదాపుగా రూ. వంద కోట్లు విలువ చేసే స్థలాన్ని రాసిచ్చారు.
వడ్డించేది.. వండేది టీఆర్ఎస్ వాళ్లే కాబట్టి.. అన్ని రకాల వ్యవస్థలు చకచకా ఆమోదం తెలిపేశాయి. ఇప్పుడు టీఆర్ఎస్కు హైదరాబాద్ జిల్లా ఆఫీసు అత్యంత విలువైన స్థలంలో నిర్మాణం కానుంది. షేక్ పేట మండలంలో సర్వే 935 చ.గ.ల స్థలాన్ని ఇచ్చారు. దీని విలువ దాదాపుగా వంద కోట్లు ఉంటుంది. షేక్ పేట అంటే బంజారాహిల్స్ .. ఎన్బీటీ నగర్లో ఈ స్థలం ఉంది.
హైదరాబాద్ కలెక్టర్ మంగళవారం సిఫారసు చేశారు. మరుసటి రోజే సీసీఎల్ఏ ఆమోదించారు. తెల్లారేసరికి ప్రభుత్వం రూ.100 కోట్ల విలువైన స్థలాన్ని టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయించేశారు. సమీపంలోనే టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఉంది. రాజు తల్చుకుంటే స్థలాలకు కొదవేముంటుంది.