సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు దాటిపోయింది. ఈ మూడేళ్ల కాలంలో ఆయన బయటకు వచ్చింది చాలా తక్కువ. జిల్లాల పర్యటనలకు వెళ్లింది పార్టీ నేతల పెళ్లిళ్లు, పేరంటాలతో పాటు ఎప్పుడైనా ఉపద్రవాలు వస్తే చూడటానికి వెళ్లారు. ఇలా వెళ్లినప్పుడు ఆయన కోసం రవాణా శాఖ కాన్వాయ్ ఏర్పాటు చేస్తుంది. ఆ కాన్వాయ్ ఏర్పాటు చేసినందుకు కార్లకు బిల్లులు చెల్లించాలి. కానీ అలాంటి పనులు చేయడం మానేసింది. కార్లను వాడుకోవడమే తప్ప.. బిల్లులు చెల్లించడం మానేసింది.
ఇప్పుడు సీఎం జగన్.. పథకాలకు మీటను ఇంట్లో ఉండి నొక్కడం లేదు. ఏదో ఓ ప్రాంతంలో సభ పెట్టి మీట నొక్కి .. విపక్షాలు, మీడియాపై తన బాధను .. ఆవేదనను.. కోపాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం అవసరమైన కాన్వాయ్‌లు ఇక ముందు కొనసాగించాలంటే కనీసం రూ. పద్దెనిమిది కోట్లు ఇవ్వాలని రవాణాశాఖ రాసింది., ఎందుకంటే కాన్వాయ్‌లోకి కార్లు పెట్టాల్సిన వారు బిల్లులు అడుగుతున్నారట. మూడేళ్ల నుంచి పైసా కూడా ఇవ్వకపోవడంతో వారంతా ఇక నుంచి జగన్ కాన్వాయ్‌కు కార్లు పెట్టేది లేదని చెబుతున్నారు.
దీంతో వారు నేరుగా ప్రభుత్వానికే లేఖ రాసి… మీడియాకు లీక్ చేశారు. అలా అయినా ఇస్తారేమోనని వారు ఎదురు చూస్తున్నారు. డబ్బులివ్వకపోవడం వల్ల రవాణాశాఖ అధికారులు ప్రజల మీద పడి వారి కార్లను ఎత్తుకెళ్తున్నారు. ఇటీవల ఒంగోలులో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు రవాణా శాఖ అధికారులు తమ గోడు తాము వెళ్లబోసుకుంటున్నారు. కానీ ప్రభుత్వం డబ్బులివ్వడం డౌటే !