రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఏపీలో నాలుగు స్థానాలు వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డికి రాజ్యసభ పదవీ కాలాన్ని పొడిగించాలని జగన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే విజయసాయిరెడ్డికి కూడా క్లారిటీ వచ్చింది. విజయసాయిరెడ్డికికి పోగా మిగిలిన వాటిలో రెండు సీట్లను బీసీలకు కేటాయిస్తారని చెబుతున్నారు. ఒకటి పారిశ్రామికవేత్తల కోటాలో అదానీకి ఇవ్వబోతున్నారు.
రాజ్యసభ సీటు హామీ ఇచ్చి పార్టీలో చేర్చుకున్నా నెల్లూరు కు చెందిన టీడీపీ బీసీ నేత బీద మస్తాన్ రావు, కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్‌సీపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి లకు రాజ్య సభ సీట్లు దక్కకున్నట్టు చెబుతున్నారు. వీరిలో కిల్లి కృపారాణి ఉత్తరాంధ్ర కు చెందిన కళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. అక్కడ మంత్రి పదవి..జిల్లా అధ్యక్ష పదవి రెండూ ధర్మాన సోదరులకే ఇవ్వడంతో కళింగ వర్గం అసంతృప్తిగా ఉంది. వారిని సముదాయించడానికి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
మిగిలిన సీటు ను వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కుటుంబానికి కేటాయిస్తున్నారు. ఇటీవల సినీ నటుడు అలీకి రాజ్యసభ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. ఆయన సీఎం జగన్‌ను కూడా కలిశారు. రెండు వారాల్లో గుడ్ న్యూస్ చెబుతానని జగన్ కూడా ఆయనకు చెప్పారు. ఇప్పుడు పీఆర్సీలాగానే రెండు వారాలు ఎన్ని వారాలవుతుందో తెలియడం లేదు.. అలీకి మాత్రం గుడ్ న్యూస్ వినిపించడం లేదు. ఇక వినిపించదని తేలిపోయింది.