తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటి వరకూ చేసిన ఆరోపణల్ని లైట్ తీసుకున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవి రాను రాను శృతి మించుతూండటంతో లీగల్ యాక్షన్స్ తీసుకోవాలని నిర్ణయించారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. వాటికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందు పెట్టాలని లేకపోతే నలభై ఎనిమిది గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని తన న్యాయవాది ద్వారా కేటీఆర్ లీగల్ నోటీస్ జారీ చేశారు.
కేటీఆర్ గారి పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని కేటీఆర్ న్యాయవాది నోటీసులో పేర్కొన్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా… కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని తెలిపారు. మంత్రి కేటీఆర్ గారి పరువుకు కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసుల్లో పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు.
ఈ నోటీసులపై బండి సంజయ్ ఇంకా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. అయితే ఆయన క్షమాపణ చెప్పే అవకాశం లేదని వంద శాతం అనుకోవచ్చు. తర్వాత కేటీఆర్ ఎలాంటి స్టెప్ వేస్తారన్నది కీలకం. పరువు నష్టం దావా వేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పురవు నష్టం కేసును ఎదుర్కొన్నారు. చివరికి క్షమాపణలు చెప్పారు. కేటీఆర్ కూడా ఆ స్థాయిలో పోరాడతారేమో చూడాలి.