ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. సమీర్ శర్మ ఈనెల 31వ తేదీన పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే ఆయన సేవలు అవసరమని సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అలా అడగడం ఆలస్యం ఇలా అనుమతి వచ్చింది. నవంబర్ నెలాఖరు వరకూ ఆయన అదనంగా సీఎస్ పదవిలో ఉంటారు. సమీర్ శర్మ గత ఏడాది అక్టోబర్ ఒకటో తేదీన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు.
ఆయన రిటైర్మెంట్ గడువు నవంబర్ 30. అంటే రెండు నెలలు మాత్రమే సీఎస్‌గా ఉండాలి. కానీ సీఎం జగన్ ఆయనకు రెండు విడతలుగా ఆరేసి నెలల పాటు పొడిగింపు ఇప్పించడంతో మరో ఏడాది అదనంగా సర్వీసులో ఉంటున్నారు. సాధారణంగా సీఎ్‌సలకు ఆరు నెలలకు మించి పొడిగింపు ఇవ్వరు. గతంలో ఒక్క సారే కాకి మాధవరావుకు ఏడాది పొడిగింపు ఇచ్చారు. గతంలో సీఎస్ నీలం సాహ్నికి మూడు నెలల చొప్పున రెండు విడతలుగా పొడిగింపు ఇచ్చారు.
కానీ సమీర్ శర్మకు మొదట ఒకేసారి ఆరు నెలలు పొడిగింపు దక్కింది. రెండో సారి మరో ఆరు నెలల పొడిగింపు దక్కించుకున్నారు. నిజానికి మోడీ సర్కార్ పదవీ కాలం ముగిసిన ఎవరికీ పొడిగింపు ఇవ్వకూడదని విధాన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు హయాంలో పొడిగింపు ఇవ్వలేదు. అయితే బీజేపీ ..బీజేపీకి ఇష్టమైన ప్రభుత్వాలు ఉన్న చోట్ల మాత్రం పట్టించుకోవడం లేదు. అడగగానే ఇచ్చేస్తున్నారు.