ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వారం రోజుల పాటు విహారయాత్రకు వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఈ సారి ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అందులో మూడు రోజుల పాటు పాల్గొని .. ఆ తర్వాత ఆయన విహారయాత్రకు వెళ్తారు. స్విట్జర్లాండ్‌లోనే విహారయాత్రకు వెళ్తారా.. లేకపోతే ఇతర దేశాలకు వెళ్తారా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ మేరకు సీబీఐ కోర్టు నుంచి జగన్ అనుమతి తీసుకున్నారు. ఈ నెల19 నుంచి 31వ తేదీ వరకూ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది.
తాను అధికారిక పర్యటనకు వెళ్లాల్సిఉందని.. దావోస్ వెళ్లేందుకు అనుమతి కావాలని జగన్ పిటిషన్ పెట్టుకున్నారు. ఈ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో జరిగిన విచారణలో .. సీబీఐ తరపు న్యాయవాదాలు జగన్ పర్యటనకు అనుమతించవద్దని విజ్ఞప్తి చేశారు. ఆయన తిరిగి రారని చెప్పలేదు కానీ.. కేసు విచారణ ఆలస్యమవుతోందన్నారు. అయితే సీబీఐ న్యాయవాదుల వాదనను తోసిపుచ్చిన కోర్టు ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతతొలి సారి ఏపీకి పెట్టుబడుల కోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారు. ఆ పర్యటనలో మూడు రోజులు మాత్రమే ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. ఏడు రోజులు మాత్రం వ్యక్తిగత పర్యటనలో ఉంటారు. ఇప్పటికే జగన్ వెళ్లగానే పెట్టుబడులు తీసుకు రారని ఆశలు పెట్టుకోవద్దని మంత్రి అమర్నాథ్ ముందుగానే చెప్పారు.