ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికల పై జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్‌ను ఎన్నికల సంఘం మార్చేసింది. ఇప్పటి వరకూ ఆ స్థానంలో ఉన్న విజయానంద్ స్థానంలో కొత్తగా ముఖేష్ కుమార్ మీనాను నియమించింది. ఏపీ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ నియామకం చేపట్టినట్లుగా ఈసీ తెలిపింది. విజయానంద్ 2019 జూన్‌లో నియమితులయ్యారు. ఆయన హయాంలో తిరుపతి, బద్వేలు ఉపఎన్నికలు జరిగాయి. ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
సాధారణంగా ఎన్నికల కసరత్తును ప్రారంభించాలనుకునే సమయంలో రాష్ట్రాల్లో సీఈవోలను మారుస్తూ ఉంటారు. అధికారం ఉంటే తమకు అనుకూలంగా ఉండే అదికారులను.. నియమించుకోవడానికి పాలక పార్టీలు ఎక్కువగా ప్రయత్నిస్తూంటాయి. ఓటర్ల జాబితా దగ్గర్నుంచి ప్రతీది ఆయన కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. అందుకే అధికార పార్టీలు అనుకూలమైన వారిని నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాయి.
ఏపీ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లే ఆలోచనలో ఉందని అందుకే రాజకీయ కార్యకలాపాలు ఉద్ధృతం చేసిందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో సీఈవోను మార్చడం రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. ముఖేష్ కుమార్ మీనా గతంలో గవర్నర్ కార్యదర్శిగా పని చేశారు.