టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోసం ఎక్కడిదాకైనా వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రక్షణశాఖ ఉద్యోగి అయిన ధర్మారెడ్డిని డిప్యూటేషన్ మీద ఏపీకి తీసుకు వచ్చి టీటీడీ జేఈవోగా నియమించారు. ఇటీవల వరకూ ఈవోగా జవహర్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడాయని పూర్తి స్థాయిలో సీఎంవోకు వెళ్లారు. దీంతో జేఈవో ధర్మారెడ్డికే ఈవోగా అదనపు చార్జ్ ఇచ్చారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. అదేమిటంటే ఆయన డిప్యూటేషన్ మే 14 అంటే శనివారంతో ముగిసిపోతుంది. తర్వాత కేంద్ర రక్షణశాఖలో రిపోర్ట్ చేయాలి. కానీ ఆయనను ఇక్కడే ఉంచాలని.. డిప్యూటేషన్ పొడిగించాలని ఏపీ ప్రభుత్వం అదే పనిగా కేంద్రానికి విజ్ఞుప్తులు చేస్తోంది.
ప్రస్తుతం ఈ ఫైల్ ప్రధానమంత్రి కార్యాలయంలో ఉంది. ఆయన అంగీకరించకపోయినా… అంగీకరించడం ఆలస్యం అయినా ధర్మారెడ్డి టీటీడీ నుంచి వైదొలగాలి. ఒక వేళ పీఎంవోలో అభ్యంతరం వ్యక్తం అయితే్.. అవసరమైతే ధర్మారెడ్డిని కేంద్ర సర్వీసులకు రాజీనామా చేయించి రాష్ట్రంలో ఐఏఎస్ హోదా ఇవ్వాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఓ ఉత్తరాది రాష్ట్రంలో ఇలా చేశారని ఓ కేస్ స్టడీని ఇప్పటికే బయటకు తీశారు. ఆ ప్రకారం.. తాము చేయాలని అనుకుంటున్నారు . ధర్మారెడ్డికి ఇంకా రెండేళ్లకుపైగా సర్వీస్ ఉంది. అంటే వైసీపీ సర్కార్ ఉన్నంత కాలం ఆయన ఈవోగా ఉంటారు. అందుకే… పదవిని వదులుకోవడానికి కూడా సిద్ధపడుతున్నారని అంటున్నారు.
అయితే ఆయన పూర్తిగా కేంద్ర సర్వీసుల ఉద్యోగి, ఆయన అక్కడ రాజీనామా చేస్తే ఏపీ క్యాడర్‌కు ఎలా వస్తారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఐపీఎస్, ఐఏఎస్‌లు అయితే రాష్ట్ర క్యాడర్ ఉంటుంది. రక్షణ శాఖ ఉద్యోగులకు రాష్ట్ర క్యాడర్ ఉంటుందా అన్నదానిపై స్పష్టత లేదు. ఎలాగైనా ధర్మారెడ్డిని టీటీడీలోనే ఉంచాలని ప్రభుత్వం చేయాల్సినదంతా చేస్తోంది. రెడ్డి కోసం ఇంత పట్టుదలకు పోవడం చాలా సార్లు జరిగిందని .. ఇదంతా సహజమేనని ప్రభుత్వ వర్గాలు తేలిగ్గా తీసుకుంటున్నాయి.