స్వరూపానంద తనకు ఎవరు ఎక్కువ సేవలు చేస్తే వారే గొప్ప అని ప్రకటించడం అలవాటుగా చేసుకున్నారు. వారు గొప్ప అని చెప్పాలంటే ఇతరుల్ని తక్కువ చేయాలి. ఇప్పుడు అదే చేస్తున్నారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ కంటే.. గతంలో ఓ సారి టీటీడీ చైర్మన్‌గా చేసిన కరుణాకర్ రెడ్డినే చాలా గొప్ప అని తేల్చేశారు. తిరుపతిలో గంగమ్మ జాతర కార్యక్రమానికి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి స్వరూపానందను… ఆయన పీఠం వారసుడు అయిన మేనల్లుడు స్వాత్మేత్రానందను కూడా ప్రత్యేకంగా పిలిచారు. వారు వెళ్లారు. వెళ్లిన తర్వాత అంత మర్యాదలు చేసిన తర్వాత కరుణాకర్ రెడ్డిని పొగడకపోతే బాగుండదని.. పొగిడేశారు. అందుకే సుబ్బారెడ్డిని టార్గెట్ చేశారు.
కరుణాకర్ రెడ్డి లాంటి వ్యక్తి టీటీడీ పాలక మండలికి ఇక రారు పుట్టబోరు .. ఇప్పుడు ఉన్న పాలక మండలి పెద్దగా కార్యక్రమాలు చేపట్టిన దాఖలు లేవని తేల్చేశారు. ఇందుకు కరోనా కారణమో లేక బుద్ది మాంద్యమో మాకు తెలియడం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఆర్జిత సేవల రద్దుపై వివరణ కోరిన మీడియాకు తప్పకుండా సేవలపై స్పందిస్తాం, మాకు ఏ ప్రభుత్వమైనా ఒక్కటే .. ఆదివారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతానని.. మరిన్ని విమర్శలు చేయబోతున్నట్లుగా హింట్ ఇచ్చారు.
సుబ్బారెడ్డితో స్వరూపానందకు ఎక్కడ చెడిందో వైసీపీ నేతలకూ అర్థం కావడం లేదు. స్వరూపానంద రిషికేష్‌లో ఉన్నా ఆయన దగ్గరకు సుబ్బారెడ్డి పరులుగు పెట్టుకుంటూ వెళ్తారు. అయినా స్వరూపానంద ఏం అడిగారో.. సుబ్బారెడ్డి ఏం కాదన్నారో కానీ ఆయనపై కోపం వచ్చింది. ఆదివారం ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో. మొత్తానికి బ్లాక్ మెయిల్ లాంటి కామెంట్లు చేసి పనులు సాధించుకోవడం స్వామికి బాగా అలవాటైపోయిందని.. వైసీపీలోనే గుసగుసలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.