బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అమరావతిలో పర్యటించారు. అక్కడి నిర్మాణాలను పరిశీలించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ వస్తారని ఎవరూ అనుకోవడం లేదని.. ఆయన మూడు రాజధానులు చేయరు.. చేయలేరని తేల్చి చెప్పారు. తన పర్యటనలో టిడ్కో ఇళ్లతో పాటు ఇతర భవనాలు.. ఇంకా ప్రైవేటు యూనివర్శిటీలను కూడా పరిశీలించారు. రాజధానిలో ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించకపోవడం వల్లనే కేంద్ర సంస్థలు పనులు ప్రారంభించలేకపోతున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పనులు ఆపేయడం వల్ల సమస్య వచ్చిందన్నారు. కనీసం మౌలిక వసతులు కల్పిస్తే సంస్థలు తమ పని తాము చేసుకుంటూ పోతాయని అన్నారు.
జగన్ ప్రభుత్వం పనులు చేయకుండా అభివృద్ధిని అటకెక్కించిందని టీడీపీ ప్రభుత్వం కూడా కొంత అసమర్థత వల్ల సమయానుకులంగా పనులు చేయలేదన్నారరు. ఇదే అదనుగా జగన్ రాజధాని నిర్మాణ పనులు నిలిపివేశారని జీవీఎల్ చెప్పుకొచ్చారు. ఆదర్శ రాజధాని చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక జగన్ నమ్మక ద్రోహం చేశారని దుయ్యబట్టారు. జగన్ మాటలు నమ్మి ఓట్లు వేస్తే రోడ్డు మీదకు లాగారన్నారు. హైకోర్టు తీర్పును ధిక్కరించే విధంగా జగన్ ప్రభుత్వం తీరు ఉందనన్నారు. రాజధానికి లక్ష కోట్లు కావాలని జగన్ సర్కార్ చెప్పడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
జీవీఎల్ నరసింహారావు మూడు రాజధానులను పరోక్షంగా సమర్థించారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదంటూ పదే పదే ప్రకటనలు చేశారు. కేంద్రానికి సంబంధం లేదని.. ఏపీ ప్రభుత్వం ఏమైనా చేయవచ్చని వాదించారు. చివరికి ఇప్పుడు రైతులు పోరాటం చేసి విజయం సాధించిన తర్వాత క్షేత్ర స్థాయి పర్యటనకు వచ్చి … రాజకీయ ప్రకటనలు చేస్తున్నారు. రైతులు ఏ పార్టీ వైపు ఉండవద్దని హితవు చెబుతున్నారు.