వరుస హత్యలను కూడా ఎంజాయ్ చేయాలి, ప్రభుత్వ ఉద్యోగాల కన్నా పాలు అమ్మడం బెటర్, శ్రీలంక, నేపాల్లోనూ బీజేపీ గెలుస్తుంది , సివిల్ సర్వీసెస్‌కు సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్లే కరెక్ట్ మెకానికల్ వాళ్లు పనికి రారు అంటూ… బీజేపీ మార్క్ తెలివి తేటల్ని ప్రతీ రోజూ అమోఘంగా బయట పెట్టే త్రిపుర సీఎంను .. ఎందుకైనా మంచిదని ఎన్నికలకు ముందు పక్కన పెట్టేశారు బీజేపీ నేతలు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న సమయంలో హఠాత్తుగా త్రిపుర సీఎంతో రాజీనామా చేయించి మాణిక్ సహా అనే రాజ్యసభ సభ్యుడిని సీఎంగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
పలు వివాదాస్పద వ్యాఖ్యలతో అనేకసార్లు వార్తల్లో నిలిచిన బిప్లబ్‌పై కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భధ్రలతలను పర్యవేక్షించడంలో సీఎం విఫలమయ్యారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్లు కూడా చేసింది. మరోవైపు సొంత పార్టీ నుంచి కూడా ఆయనకు అసమ్మతి సెగ తగిలింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నాయకత్వ మార్పు చేయాలని హైకమాండ్ భావించింది.
నిన్ననే ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి చర్చించారు. ఆ తర్వాత త్రిపుర వెళ్లి రాజీనామా సమర్పించారు. ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో పరిస్థితి బాగోలేకపోతే ముఖ్యమంత్రులను బీజేపీ మార్చేస్తోంది. త్రిపురలో గతంలో బీజేపీకి ఒక్క సీటు కూడా ఉండేది కాదు. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం మెజార్టీ సాధించింది. ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉండటంతో సీఎంను మార్చింది.