తెలంగాణలో తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా అమిత్ షా చాలెంజ్ చేశారు. తెలంగాణ అభివృద్ధి సాధించాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. తక్కుగూడలో నిర్వహించిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో పాల్గొని ప్రసగించారు. రజాకార్ పాలన నుంచి విముక్తి కల్పించేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేశారన్నారు. యువత అంతా కదిలి రావాలని.. కేసీఆర్ అంత అవినీతి ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అమిత్ షా మండిపడ్డారు. కేంద్ర పథకాలకు పేర్లు మార్చి అమలు చేసి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.
అమిత్ షా తన మతపరమైన టార్గెట్లనూ వదిలి పెట్టలేదు. మైనార్టీలకు రిజర్వేషన్లు తగ్గించి ఎస్సీ, ఎస్టీలకు పెంచుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు చాన్సులిచ్చారని బీజేపీకి కూడా ఒక్క చాన్సివ్వాలని బండి సంజయ్ ప్రజలకు పదే పదే విజ్ఞప్తి చేశారు. కేసీఆర్ ఒకసారి వరి వద్దంటారు.. మరోసారి పత్తి వద్దంటారు. తుగ్లక్ నిర్ణయాలతో తెలంగాణ రైతాంగాన్ని సీఎం ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఒకే కుటుంబం పాలించిన శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో చూడండి. కీలక శాఖలన్నీ కల్వకుటుంబం కుటుంబం చేతుల్లోనే ఉంది. కేసీఆర్ పాలన పోకపోతే మనకూ శ్రీలంక పరిస్థితే దాపురిస్తుందని హెచ్చరించారు.
ప్రజాసంగ్రామ యాత్రలో తనకు 18వేల అర్జీలు వస్తే.. అందులో 60 శాతం ఇళ్లులేని పేదోళ్లవే. మోదీ ఆలోచన మేరకు పేదవాళ్ల కోరికలు నెరవేరాలంటే రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడాలి. అధికారంలోకి వస్తే నిలువ నీడలేని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రధాని ఆవాస్ యోజన కింద ఇళ్లు నిర్మిస్తాం. నిరుద్యోగులకు ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం. రాష్ట్రంలో వ్యాట్ సవరించి పెట్రోల్, డీజిల్ రేటు తగ్గిస్తాం. ఫసల్ బీమా యోజనతో రైతాంగాన్ని ఆదుకుంటాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీలను కచ్చితంగా నెరవేర్చుతామని హామీ ఇచ్చారు.