ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఆశ్చర్యకరంగా కనిపిస్తోంది. ఓ వైపు తెలంగాణ అన్ని వివరాలు ఇచ్చినా అప్పులకు అనుమతి విషయంలో తేల్చలేదు. కానీ ఏ వివరాలు ఇవ్వకుండా అడ్డదిడ్డమైన దొంగలెక్కలు పంపుతున్న ఏపీకి మాత్రం అడినన్ని అప్పులు చేసుకోవడానికి పర్మిషన్లు ఇస్తున్నారు. ఇలా ఇస్తే సరే.. కానీ వివరాలు చెప్పాలంటే పదే పదే లేఖలు పంపుతున్నారు. తాజాగా ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ వచ్చింది. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాల గురించి చెప్పాలని లేఖ సారాంశం.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సార్లు అడుగుతున్నా ఇవ్వడం లేదు. దీనిపై చర్యలు తీసుకోవడం క్షణం పని. చర్యలు తీసుకున్నా లేకపోయినా కొత్త రుణాలను తీసుకోవడం ఆపేస్తే.. మొత్తం వివరాలు తక్షణం ఇస్తారు. కానీ అదీ కూడా చేయడం లేదు. అడిగినన్ని అప్పులు ఆర్బీఐ నుంచి ఇప్పిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రూ. పదకొండు వేల కోట్ల వరకూ అప్పు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బ్యాంకులు ఇచ్చే అప్పులు బయటకు తెలియడం లేదు. నిజానికి కేంద్రం ఏపీ అప్పుల లెక్కల గురించి తెలుసుకోవాలంటే బ్యాంకులకు ఒక్క లేఖ రాస్తే చాలు. మొత్తం బయటకు వస్తుంది.
ఏపీ ప్రభుత్వం తప్పుడు లెక్కలు రాయడంలో రాటుదేలిపోయింది. ఆ లెక్కలు రాయాల్సిన ఐఎఎస్ అధికారులను కూడా ఇరించేస్తోంది. పోస్టుల కోసమో.. పోస్టింగ్‌ల కోసమో.. వారు కూడా లొంగిపోయారు. ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తున్నారు. ఈ పరిణామాలపై పూర్తి సమాచారం ఉన్నా కేంద్రం మాత్రం.. తాము చర్యలు తీసుకుంటున్నామనే అభిప్రాయం కల్పించడానికి నోటీసులతో సరి పెడుతోంది. దీని వల్ల ఎవరికి నష్టమో త్వరలోనే తేలిపోనుంది.