ప్రొబేషన్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామ ,వార్డు సచివాలయ ఉద్యోగులకు భారీ షాక్ తగలనుంది. జూన్లో ప్రొబేషన్ ఖరారు చేసి జూలై నుంచి పే స్కేల్ ప్రకారం జీతాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లరేషన్ కోసం నిర్వహించిన పరీక్షల్లో సగాని కన్నా తక్కువ మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని ప్రభుత్వం చెబుతోంది. మొత్తం 1.17,954 మంది పరీక్షలకు హాజరుకాగా 56,758 మంది మాత్రమే పాస్ అయ్యారు. మిగిలిన 61,196 మంది ఫెయిల్ అయ్యారు. వీరంతా వేరువేరు కారణాలతో పరీక్ష తప్పినట్లు ప్రభుత్వం చెబుతోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడగానే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇందులో పని చేసేందుకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించి ఉద్యోగ నియామకాలు చేశారు. తొలి రెండేళ్లు రూ. 15వేల చొప్పున ఇస్తామని ఆ తర్వాత ప్రొబేషన్ ఖరారు చేసి పే స్కేల్ ప్రకారం ఇస్తామని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. అయితే ప్రభుత్వం రెండేళ్లయిన తర్వాత మళ్లీ పరీక్షలు పెడతామని అందులో ఉత్తీర్ణులయిన వారికే ప్రొబేషన్ ఇస్తామని చెబుతోంది.
ఈ మేరకు పరీక్షలు నిర్వహించింది. రెండేళ్లుగా విధినిర్వహణలో ఉన్నా ఇప్పుడు పరీక్షల పేరుతో తమను పర్మినెంట్ చేయకుండా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం అన్న కారణంతో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలను సైతం వదులుకుని చాలా మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో చేరారు. రెండేళ్ల తర్వాత వారికి ప్రొబేషన్ ఖరారు కాకపోగా ఇప్పుడు అయ్యే అవకాశం లేదన్న సంకేతాలు ప్రభుత్వం నుంచిరావడం వారిని నిరాశపరుస్తోంది. లేని పరీక్షలు పెట్టి కడుపు కొడుతోందని ప్రభుత్వంపై న్యాయపోరాటానికి ఉద్యోగులు సిద్ధమవుతున్నారు.