మొత్తానికి ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డి కోరిక నెరవేరింది. పైకి సింపుల్‌గా కనిపించినప్పటికీ.. ఇది ఆయనకు చాలా పెద్ద ఊరట కిందే లెక్క. ఢిల్లీ వెళ్లిన సమయంలో అక్కడ చక్రం తిప్పారో, లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లుగా అర్ధరాత్రి ఢిల్లీ మీటింగుల ద్వారా రిజల్టు సాధించారో తెలియదు గానీ మొత్తానికి వైఎస్ జగన్ కాస్త తాను అనుకున్నది సాధించుకోగలిగారు.
అబ్బే.. ఇదంతా.. ఆయన పార్టీలోంచి ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలను నియంత్రించడానికి సంబంధించిన గొడవ కాదు. అందులో ఆయన ప్రస్తుతానికి చేయగలిగింది ఏమీ లేదు. పోతూ ఉన్న వారిని చూస్తూ ఉండాల్సిందే. కాకపోతే.. పార్టీనుంచి వలసలకంటె ఎక్కువగా జగన్‌ను ఇబ్బందిపెడుతున్న ఈడీ కేసులకు సంబంధించిన వ్యవహారం ఇది. ఈ విషయంలో జగన్ కోరిక నెరవేరింది.
వివరాల్లోకి వెళితే.. జగన్ అక్రమాస్తుల కేసులో పెట్టుబడలుకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌కు బదిలీ చేయాలంటూ ఈడీ ఒక పిటిషన్ వేసిఉంది. హైదరాబాదులోని సీబీఐ కోర్టులో దీనికి సంబంధించిన విచారణ జరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ విచారణలు తీవ్రంగా ఉండబోయే నేపథ్యంలో జగన్ ఇటీవల హైకోర్టుకు ఒక ప్రత్యేక అభ్యర్థన పెట్టుకున్నారు. అసలు తన మీద ఉన్న సీబీఐ కోర్టు విచారణ మొత్తం పూర్తయ్యేవరకు ఈడీ కోర్టులో విచారణను ఆపు చేయించాల్సిందిగా కోరుతూ ఆయన హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు ఆ విజ్ఞప్తిని కొట్టేసింది. రెండు కోర్టుల్లో విచారణ ఇబ్బంది అయ్యేట్లయితే.. సీబీఐ కేసు కూడా ఈడీకి మార్చేయమంటారా అంటూ హౖాెకోర్టు ప్రశ్నించడంతో జగన్ వర్గం కుదేలై.. అలా వద్దంటూ విన్నవించుకున్నారు.
ఈలోగా సీబీఐ కేసును తమ కోర్టుకు మార్చాలంటూ ఈడీ ఒక పిటిషన్ వేయడం గమనార్హం. అదే జరిగితే.. జగన్ ప్రతిసారీ విచారణకు ఈడీ కోర్టుకే ఢిల్లీ వెళ్లి హాజరు కావాల్సి ఉంటుంది. ఈ చిక్కు నుంచి తప్పించుకోవడానికి జగన్ ప్రయత్నించారు. ఆయన తరఫు న్యాయవాదులంతా.. జగన్ అక్రమాస్తుల అవినీతి కేసుల్ని విచారించే అధికారం ఈడీ కోర్టుకు లేదంటూ వాదనలు వినిపించారు. ఏదైతేనేం మొత్తానికి సీబీఐ కేసును ఈడీకి బదిలీ చేయడం కుదరదంటూ సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చేసింది. ఈడీ వారి పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో.. జగన్‌కు కాస్త ఊరట దొరికినట్టే అనుకోవాలి. పైకి కనిపించకపోయినప్పటికీ.. ఈ కేసులో ఈడీ తీవ్రత పరంగా చాలా చికాకు ఉండడంతో ఇప్పటికి ఒక ఇబ్బంది తొలగిపోయిందని, జగన్ ఇక పార్టీకి కలుగుతున్న నష్టం మీద కాస్త పూర్తి శ్రద్ధ పెట్టగలరని పలువురు అనుకుంటున్నారు.