పాదయాత్ర చేసి బీజేపీ గ్రాఫ్‌ను పెంచారని బండి సంజయ్‌కు ప్రధాని మోజీ ఫోన్ చేసి మరీ శభాష్ అని పొగిడారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ సభ సక్సెస్ అయిందని అభినందనలు తెలిపారు. కష్టపడి పని చేస్తున్నారంటూ బండి సంజయ్ కుమార్ ను అభినందించారని తెలంగాణ బీజేపీ ప్రకటించింది. నడిచింది నేనయినా.. నడిపించింది మీరేనని బండి సంజయ్ ప్రధానికి తెలిపారు. మోదీ చెప్పిన ” సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్” పాలన రాష్ట్రంలో తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నామని బండి సంజయ్ ప్రధానికి తెలిపారు.
పాదయాత్రలో ప్రజలు ఏమంటున్నారని సంజయ్ ను ప్రధాని మోదీ అడిగారు. కేసీఆర్ పాలనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ..కేంద్ర పథకాలు తెలంగాణలో అమలు చేయకుండా కేసీఆర్ తెరమరుగు చేసే కుట్ర చేస్తున్నారని ప్రధానికి బండి తెలిపారు. పాదయాత్రలో కేంద్రం పేదల కోసం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తుండoతో కేసీఆర్ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. తెలంగాణా లోనూ మీలాంటి నీతివంతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వివరించారు.
ప్రధానమంత్రి ఫోన్ చేయడంతో కార్యకర్తల్లో నూతనోత్సాహం వచ్చిందని బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ వారాంతాల్లో బాగా పని చేస్తున్న పార్టీ నేతలకు ఫోన్లు చేస్తూంటారు. గతంలో గ్రేటర్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించినప్పుడు కూడా బండి సంజయ్‌కు ప్రధాని ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. నిన్న అమిత్ షా.. కేసీఆర్‌కు పోటీగా బండి సంజయ్ అని ప్రకటించడం.. ఇవాళ మోదీ నేరుగా ఫోన్ చేయడంతో హైకమాండ్ వద్ద మరింత పలుకుబడి పెరిగిందని బండి సంజ్ వర్గీయులు సంతృప్తిగా ఉన్నారు