– ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న చర్చ ఇదే. జగన్ ప్రభుత్వం… టికెట్ రేట్లని భారీగా తగ్గించేసి, నిర్మాతల్ని ఇక్కట్లలో పడేసింది. ఆ తరవాత టికెట్ రేట్లని అమాంతంగా పెంచేసి…`సినిమా`ని ప్రేక్షకులకు, వసూళ్లని నిర్మాతలకూ దూరం చేసింది. తెలంగాణలో కూడా ఇదే తీరు. ఇదంతా చిత్రసీమకు మేలు చేద్దామని తీసుకొన్న నిర్ణయమే కావొచ్చు. అయితే ఈ పెంపు ప్రతికూల ప్రభావాన్నే చూపిస్తోంది. ఆర్.ఆర్.ఆర్, కేజీఎఫ్లకు టికెట్ రేట్లు పెంచుకోవచ్చన్న నిబంధన బాగా వర్కవుట్ అయ్యింది. ఇది వరకు చూడని అంకెలు ఈ రేట్ల పెంపువల్ల చూసే అవకాశం, అదృష్టం దక్కాయి. కానీ అన్నీ ఆర్.ఆర్.ఆర్లూ, కేజీఎఫ్లు కావు కదా. ఆచార్యలూ ఉంటాయి.
కాస్త నెగిటీవ్ టాక్ వచ్చినా.. జనం థియేటర్ల మొహాలే చూడడం లేదు. చిన్న సినిమాలైతే సరే సరి. ఎంత మంచి టాక్ వచ్చినా..`ఓటీటీలో చూస్కొందాం` అని ఫిక్సయిపోతున్నారు. టికెట్ రేట్లు అలా ఉన్నాయి. తెలంగాణలో అయితే… మల్టీప్లెక్స్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకుంటే.. దాదాపు రూ.400 అవుతోంది. ఓ ఫ్యామిలీ మొత్తం సినిమాకి వెళ్లాలంటే ఖర్చులతో సహా మూడు వేలు ఎగిరిపోతున్నాయి. ఈ ఖర్చు ప్రేక్షకుల్ని భయపెట్టేదే. నెలకో సినిమా అంటే సర్దుకుపోవొచ్చు. వారానికి ఓ సినిమా వస్తున్నప్పుడు, రెగ్యులర్ ఆడియన్స్ కూడా సినిమాలకు దూరం అయిపోతారు. ఇక రిపీటెడ్ ఆడియన్స్ ఎందుకొస్తారు?
అందుకే పెంచిన రేట్లు మళ్లీ సవరిస్తే బాగుంటుందన్న దిశగా…చిత్రసీమ ఆలోచిస్తోంది. పెద్ద సినిమాలకు తొలి వారంలో టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంది. కానీ. ఇప్పుడు నిర్మాతలు `అదేం వద్దు.. మామూలు రేట్లే చాలు` అంటున్నారు. ఈనెల 27న ఎఫ్ 3.. వస్తోంది. ఈ సినిమాకి రెగ్యులర్ రేట్లే ఉండబోతున్నాయని టాక్. సర్కారు వారి పాటకు… రేట్లు పెంచడం వల్ల ఉపయోగం ఏమీ కనిపించలేదు. టికెట్ తక్కువగా ఉంటేనే, కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు తరలి వస్తారన్న నిజం ఇప్పుడిప్పుడే నిర్మాతలకు అర్థం అవుతోంది. దీనిపై త్వరలోనే నిర్మాతలంతా కలిసి ఓ కీలకమైన సమావేశం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.