పవన్ కల్యాణ్ చేస్తున్న రైతు భరోసా యాత్రలో ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు కుటుంబాన్ని కూడా చూపించలేకపోయారని సీఎం జగన్ తేల్చేశారు. రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన… తాను చేస్తున్న మంచి చెప్పుకునేదాని కన్నా …చంద్రబాబు, పవన్ ను విమర్శించాడనికే ఎక్కువ సమయం కేటాయించారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ రైతు భరోసా యాత్రపై విమర్శలు గుప్పించారు. కౌలు రైతుల కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్న రైతుల్లో ఎవరు ఆత్మహత్య చేసుకున్నా తమ ప్రభుత్వం పరిహారం ఇస్తోందని ఎవరికీ ఆపలేదని చెప్పుకొచ్చారు. నిజానికి ఒక్కో జిల్లా వంద మందికిపైగా కౌలు రైతులకు పవన్ కల్యాణ్ సాయం చేస్తున్నారు. అదంతా ఆయన సినిమాల్లో కష్టపడి సంపాదించిన డబ్బు.
పవన్ ఏదైనా జిల్లాకు వెళ్తూంటే హడావుడిగా ఒకరిద్దరు రైతు కుటుంబాలకు సాయం మంజూరు చేసేది ప్రభుత్వం. దానికే అందరికీ ఇచ్చేస్తున్నామని చెప్పుకుంటున్నారు జగన్. అప్పట్లో చంద్రబాబును పవన్ ఎందుకు ప్రశ్నించలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వ్యవసాయం దండగన్నారని.. మరోసారి పాత రికార్డే చెప్పుకొచ్చారు. తమ పాలనలో రైతులకు ఎక్కువ దిగుబడి వస్తోంది… విస్తారంగా నీరు అందిస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేశారని ఆరోపించారు. అప్పుడు దుష్టచతుష్టయం ప్రశ్నించలేదన్నారు. గత పాలనకు ఇప్పటికి ఉన్న తేడాను రైతులు గుర్తించాలని జగన్ చెప్పుకొచ్చారు.
2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు. అయితే ఈ మొత్తం … విడుదల చేస్తే ఒక్కో రైతుకు ఏడున్నర వేలు రావాలి. కానీ ఐదున్నర వేలు మాత్రమే జమ చేస్తున్నట్లుగా జగన్ ప్రకటించారు. కానీ స్టేజ్‌పై చెక్కు మాత్రం రూ.3,758 కోట్లకు ఉంది. అంటే అది ఫేక్ చెక్కన్న విమర్శలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అంత కంటే తక్కువే విడుదల చేసి.. నెలాఖరులో కేంద్రం ఇచ్చే రూ. రెండు వేలకు కూడా తమ ఖాతాలో కలుపుకుని చెక్‌పై నెంబరేశారని సెటైర్లు వేస్తున్నారు.