ఓటీటీలు వచ్చిన తర్వాత సినిమాలకి కొత్త మార్కట్ ఏర్పడినట్లయింది. చిన్న మీడియం సినిమాలు నేరుగా ఓటీటీలోకి వెళ్ళిపోతున్నాయి. పెద్ద సినిమాలని కోట్లు చెల్లించి మరీ కొనుక్కుంటున్నాయి ఓటీటీలు. ఐతే పెట్టుబడి వసూలు చేయడానికి కొత్త మార్గాలు అనుసరిస్తున్నాయి.తాజాగా ‘కేజీయఫ్2’ దీనికి నిదర్శనంగా నిలిచింది. అమెజాన్ ప్రైమ్ తమ పోర్టల్ లో ‘కేజీయఫ్2’ ని అప్లోడ్ చేసేసింది. చూద్దామని క్లిక్ చేస్తే షాక్ ఇచ్చింది. ఇది చూడాలంటే ఎర్లీ యాక్సెస్ పేరిట అదనంగా రూ.199 చెల్లించాలి. అంటే తీసుకున్న సభ్యత్వానికి ఇది అదనం. ‘కేజీయఫ్: చాప్టర్2’ చూడాలంటే సినిమాను అద్దెకు తీసుకోవాలి. ఇందుకు రూ.199 చెల్లించాలి. ఒకసారి సినిమా చూడటం మొదలు పెట్టిన తర్వాత 48 గంటల్లో గడువు పూర్తయిపోతుంది. అంటే ‘కేజీయఫ్2’ అద్దెకు తీసుకుని, చూడటం మొదలు పెడితే 48 గంటల్లో సినిమా చూసేయాలి. మే 20 జీ5 వేదికగా రాబోతున్న ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఇదే పంధాని అనుసరిస్తుందని తెలుస్తుంది.
ఐతే ఈ విధానంలో చందా దారుడిపై భారం పడినట్లే. అప్పటికే సభ్యతం తీసుకున్న చందాదారుడు ఓ కొత్త సినిమా కోసం రూ.199 చెల్లించడం అంటే భారమే. ఈ విధానంతో ఓటీటీలకు ఆదరణ తగ్గే అవకాశం వుంది. అంతేకాదు..ఇది సినిమాకి కూడా నష్టం. ఇప్పటికే పైరసీ దారుణంగా పెరిగిపోయింది. థియేటర్ పైరసీ పక్కన పెడితే.. ఓటీటీలకు ఛార్జులు చెల్లించకుండా మూవీ రూల్జ్ లాంటి సైట్స్ హెచ్డీ ప్రింట్ట్లు డౌన్ లోడ్ చేసుకొని చూస్తున్నారు. ఇప్పుడు సభ్యత్వం వున్న వాళ్ళకు కూడా ఇలాంటి ఎక్స్ ట్రా ఫీజులు పెడితే జేన్యున్ వ్యూవర్స్ కూడా మూవీ రూల్జ్ లాంటి పైరసీ సైట్లు వైపు చూసే ప్రమాదం వుంది.
ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది. థియేటర్ లో పైరేట్ చేసిన ప్రింట్లు చూడటం కొంచెం తగ్గించారు. అయితే ఓటీటీలో రిలీజ్ అయ్యే ఫైల్ మాత్రం క్రిస్టల్ క్లియర్ గా పైరసీ సైట్ లో దొరుకుతుంది. ‘కేజీయఫ్2′ థియేటర్ లో ఇంకా ఆడుతుంది. ఇప్పుడు గానీ ఇలాంటి ఎక్స్ ట్రా ఫీజులతో ఓటీటీలో అప్లోడ్ చేస్తే,.. ఒక్క హెచ్డీ ప్రింట్ చాలు పైరసీ ఫైల్ వైరల్ అవ్వడానికి. ఆల్రెడీ సభ్యత్వం వున్న వాళ్ళు పైరసీ వైపు చూస్తే మాత్రం ఓటీటీలేకే ముప్పు. హైస్పీడ్ ఇంటర్నెట్ వున్న వాళ్ళే ఓటీటీలు వాడుతారు. ఇలా వాడిని వారందరికీ నెట్ బ్రౌజ్ చేయడం, డౌన్ లోడ్ చేసుకోవడం పెద్ద సమస్య కాదు. ఇలాంటి ఎక్స్ ట్రా ఫీజులతో చందాదారులకు చిరాకు తెప్పిస్తే మునిగిపోయేది ఓటీటీలే. ఈ సంగతి గుర్తుంచుకుంటే మంచిది.