కొంత మందికి అధికారం అందితే బలపడతారు. చాలా మంది ఆ అధికారాన్ని ఎలా వాడుకోవాలో తెలియక బలహీనపడతారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి అలాగే ఉంది. మంత్రిగా చేసిన ఆయన సొంత పార్టీలో శత్రువుల్ని రెండింతలు చేసుకున్నారు. ఇప్పుడు ఎదురీదుతున్నారు. ఆయన అనుచరులు తప్ప.. నెల్లూరు సిటీలో వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఆయన వెంట లేదు. ఓ వర్గం ఆనంతో మరో వర్గం కాకాణితో ఉంది.
నెల్లూరు కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఒక్క కార్పొరేటర్ సీటు రాలేదు. వైసీపీ వంద శాతం క్లీన్ స్వీప్ చేసింది. అయితే వైఎస్ఆర్సీపికి ఇక తిరుగులేదని ఎవరూ అనుకోవడం లేదు. చివరికి సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా అనుకోలేని పరిస్థితి ఏర్పడింది. మంత్రి పదవి పోయిన తర్వాత ఆయనను కలిసే నాయకుడే లేరు. ఆయనే వెళ్తున్నా మొహం చాటేస్తున్నారు. హైకమాండ్ పిలిచి మరీ కాకాణి గోవర్ధన్ రెడ్డితో గొడవల విషయంలో వార్నింగ్ ఇవ్వడంతో పూర్తిగా మారిపోయారు. దీంతో ఆయనకున్న రెబల్ ముద్ర కాస్తా పోయింది.
అనిల్ కుమార్ యాదవ్‌కు సిటీలో మొదటి నుంచి ఆనం వర్గీయుల సపోర్ట్ ఉంది. అనిల్ కుమార్ తండ్రి ఆనం కుటంబానికి నమ్మకస్తుడు. ఈ కారణంగా ఆనం కుటుంబం కాంగ్రెస్‌లో రాజకీయ అవకాశాలు కల్పించింది. నెల్లూరు సిటీకి బీసీ అభ్యర్థి అవకాశం కల్పించాలనుకున్నప్పుడు ఆనం కుటుంబం 2009లో అనిల్ కుమార్‌కు చాన్స్ ఇప్పించింది. అయితే ఆ ఎన్నికల్లో అతి స్వల్ప తేడాతో పీఆర్పీ విజయం సాధించింది. ఆ తర్వాత జగన్ వైపు మారిపోయారు అనిల్ కుమార్. రాజకీయంగా ప్రోత్సహించిన ఆనం ఫ్యామిలీని టార్గెట్ చేశారు. దీంతో ఆయన తన బేస్ సపోర్ట్‌ను కోల్పోయారు.
ఇప్పుడు నెల్లూరు సిటీలో ఆనం వర్గీయులు ఎవరూ అనిల్ వెంట లేరు. మంత్రిగా అనిల్ తమపట్ల వ్యవహరించిన తీరుతో ఆనం వర్గీయులు రగిలిపోతున్నారు. నెల్లూరు టౌన్లో కలిసి ఉంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో ఆయనకు సరిపడటం లేదు. కాకాణి బయటకు ఏమీ చెప్పరు కానీ ప్రత్యర్థిని ఓడించడానికి ఏదైనా చేస్తారని నెల్లూరులో చెప్పుకుంటారు. ఆయనకు సిటీలోనూ ఇప్పుడు అనుచరులు పెరిగారు. దీంతో నెల్లూరు సిటీలో అనిల్ కుమార్ ఒంటరి అనడం కన్నా.. ఎక్కువ మంది సొంత పార్టీ శత్రువులతో పోరాటం చేస్తున్నారని అనుకోవాలి.
టీడీపీ నుంచి పోటీ చేసిఓడిపోయిన విద్యాసంస్థల అధినేత నారాయణకు నియోజకవర్గంలో సానుభూతి కనిపిస్తోంది. ఆయన మంత్రిగా నెల్లూరులో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వేల కోట్లలోనే ఉన్నాయి. మూడేళ్లలో అవి ఎక్కడివక్కడే ఉన్నాయి. ఆయన ఓడిపోయారంటే చాలా మంది నమ్మలేకపోయారు. ఆయన టీడీపీలో యాక్టివ్‌గా లేనప్పటికీ.. ఆయన లేకపోతే ఆయన కుమార్తె పోటీ చేస్తారని టీడీపీ వర్గాలు ఫిక్సయిపోయాయి. అందుకే ఇతర నేతలు చురుగ్గా పని చేస్తున్నారు కానీ టిక్కెట్ ఆశించడం లేదు.
గత ఎన్నికల్లో కేవలం రెండు వేల ఓట్ల తేడాతో అనిల్ గెలిచారు. జనసేన అభ్యర్థి ఐదు వేలకుపైగా ఓట్లను చీల్చారు. టీడీపీ -జనసేన మధ్య పొత్తు కుదిరి.. తమ పార్టీ నేతలతో సయోధ్య చూసుకోకపోతే.. అనిల్ తన సీటుపై ఆశలు వదులుకోవాల్సిందేనని చెప్పుకోవచ్చు.