అమెరికాలో భారతీయులు గుండెలు గుభిల్లుమంటున్నాయి. కొన్ని తరాల కిందటే స్వదేశాన్ని వదులుకుని అమెరికా తీరాలకు వచ్చి స్థిరపడి తమ జీవితాలను ఇక్కడి సమాజంతో మమేకం చేసుకుని బతుకుతున్న వారు కొందరు. ఇప్పుడిప్పుడే కెరీర్ మీది కొండంత ఆశలతో అమెరికాకు తరలివచ్చి.. తమకు తగిన అవకాశాలను అన్వేషించుకుంటూ.. గడుపుతున్న వారు కొందరు.. ఇలాంటి లక్షల మంది భారతీయ అమెరికన్లకు ఆందోళన కలగడానికి ప్రధాన కారణం.. ప్రస్తుతం అధ్యక్ష రేసులో ఉన్న ట్రంప్. తాను ప్రెసిడెంట్ అయితే భారతీయుల్ని వెనక్కు పంపుతా.. అంటూ ఆయన చేస్తున్న ప్రకటనలు.. చాలా మందిలో ఒక ఆందోళనను పుట్టిస్తున్నాయి. అమెరికా ఎన్నికల్లో ‘‘తమను వెనక్కి తరిమేయడం’’ అనే అంశం ఒక ఎన్నికల ప్రజాకర్షక హామీగా మారిపోయినందుకు అక్కడి భారతీయులు చింతిస్తున్నారు.
ఆయన చేసిన ఈ సంచలన ప్రకటన అధ్యక్ష ఎన్నికలలో అమెరికన్లను ఆకట్టుకోవడానికే కావచ్చును తప్ప దానిని నిజంగా అమలుచేయడం చాలా కష్టమని అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ విధంగా చేయదలిస్తే ముందుగా ఆయన స్వంత రియల్ ఎస్టేట్ కంపెనీలలోనే పనిచేస్తున్న వందలాదిమంది భారతీయులని, ఇతర దేశాలకు చెందినవారినే వెనక్కి తిప్పి పంపవలసి ఉంటుంది. అమెరికన్లతో పోలిస్తే చాలా తక్కువ వేతనాలకు ఎక్కువ సమయం కష్టపడి పనిచేసే గుణం ఉన్న భారతీయ నిపుణులను డోనాల్డ్ ట్రంప్ కి చెందిన సంస్థతో సహా ఏ సంస్థా కూడా వదులుకోవడానికి ఇష్టపడదు. ట్రంప్ కూడా అందుకు సిద్దంగా లేరు కనుకనే నేటికీ వారి సేవలను ఉపయోగించుకొంటున్నారు.
కనుక ట్రంప్ ఇటువంటి వివాదాస్పద ప్రకటనలతో సంచలనం సృష్టిస్తూ అమెరికన్లను ఆకట్టుకొని అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికవ్వాలని ప్రయత్నిస్తున్నట్లున్నారు. కానీ ఆయన చేస్తున్న ఇటువంటి ప్రకటనల వలన అమెరికాలో స్థిరపడిన విదేశీయులు అందరిలో తీవ్ర అభద్రతాభావం కల్పిస్తూ వారిని శత్రువులుగా మార్చుకొంటున్నారు. అదే సమయంలో అమెరికన్లలో విదేశీ ఉద్యోగుల పట్ల విద్వేషం రగిలించి దేశానికి కొత్త సమస్యలు సృష్టిస్తునట్లుంది. మరి అమెరికన్లు ఎవరిని అధ్యక్షుడుగా ఎన్నుకొంటారో చూడాలి.