తెలంగాణలో వారానికో రాజకీయ పార్టీ పుడుతోంది. అందరూ భీకమైన ప్రకటనలు చేస్తున్నారు. ఒకప్పుడు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదు.. టీఆర్ఎస్ తప్ప మరో పార్టీకి చోటు లేదనే ప్రకటనలు ఎక్కువగా వినిపించేవి. ఇప్పుడు మాట్లాడితే ప్రతి ఒక్కరూ తాము పార్టీ పెడుతున్నాం అంటున్నారు. చివరికి ఏపీ నుంచి వచ్చి నిర్మోహమాటంగా తెలంగాణలో పార్టీలు పెట్టి పాదయాత్రలు చేసేస్తున్నారు.
షర్మిల ఏపీ నుంచి వచ్చి షర్మిల రాజకీయ పార్టీ పెట్టారు. పోవాలి దొర రాజ్యం.. రావాలి రాజన్న రాజ్యం అంటూ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజాశాంతి పార్టీని షెడ్డులో పెట్టేసి అమెరికా వెళ్లిపోయిన కేఏ పాల్ తర్వాత వచ్చి తెలంగాణలో రాజకీయం ప్రారంభించారు. ఆయన ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. ఐపీఎస్ పదవికి హఠాత్తుగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన స్వేరో ప్రవీణ్ కుమార్ .. తర్వాత కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నారు. కానీ బీఎస్పీలో చేరిపోయారు. ఆయన చురుకుగా తిరుగుతున్నారు.
ఇప్పుడు జర్నలిస్టు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ మల్లన్నది కూడా సొంత రాజకీయ పార్టీ బాటే. గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఆయన మూడో స్థానంలో నిలిచారు. ఆయనకు రాష్ట్ర వ్యాప్తంగా అనుచర గణం ఉంది. కానీ తర్వాత కేసుల పాలై… బీజేపీలో చేరారు. ఇప్పుడు బీజేపీని కూడా వదిలేస్తున్నారు. మ ళ్లీ సొంత ఆందోళనలు చేపడుతున్నారు. ఎన్నికల నాటికి ఆయన కూడా సొంత పార్టీ పేరుతో రాజకీయం చేయనున్నారు. తాము కూడా కొత్త పార్టీలు పెడతామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్య కూడా ఇప్పటికే ప్రకటించారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ది కూడా అదే ఆలోచన. వీరు కూడా వేర్వేరుగా రాజకీయ పార్టీలు పెట్టబోతున్నారు.
ఇంకా ఎన్ని రాజకీయ పార్టీలు తెర ముందుకు వస్తాయో కానీ.. ఇప్పటికే తెలంగాణ పొలిటికల్‌గా ఓవర్ లోడ్ అయిపోతోంది. దీని వల్ల ఎవరికి నష్టం జరగబోతోంది.. ఎవరి ఓట్లు చీలబోతున్నాయి.. అసలు వీరందరికి సపోర్ట్ ఎవరు అన్నది మాత్రం బయటకు రావడం లేదు.