నవ్వించడం అంత ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. సినిమా అంతా నవ్వించడానికి చాలా శ్రమపడాలి. అప్పటో జంథ్యాల ఆ తరవాత ఈవీవీ, ఎస్వీ కృష్ణారెడ్డి ఈ ఫీట్ ని సాధించారు. ఈతరంలో అయితే… అనిల్ రావిపూడి పేరే కనిపిస్తోంది. తను ఎలాంటి కథని ఎంచుకొన్నా, పూర్తి వినోదాత్మకంగా చెప్పడం నేర్చుకొన్నాడు. అదే థియేటర్లకు ఆడియన్స్ ని తీసుకొస్తుంది. తనలో ఎంత ఫన్ ఉందో.. ఎఫ్ 2లో చూపించేశాడు అనిల్ రావిపూడి. ఇప్పుడు ఎఫ్ 3 వంతు వచ్చింది. ఈ సినిమా ఎప్పుడో పూర్తయిపోయి, ఇప్పుడు విడుదలకు రెడీ అయ్యింది. ఈనెల 27న వస్తోంది. ఈ సినిమాలోనూ కావల్సినన్ని ట్రాకులు, ఎపిసోడ్లు… ఉన్నాయట. మొత్తంగా ఆరు కామెడీ ఎపిసోడ్లు.. థియేటర్లో నవ్వులు పూయిస్తాయని తెలుస్తోంది.
అందులో రాంబోగా.. అలీ ఎపిసోడ్ అయితే హైలెట్ గా నిలవబోతోందట. జూనియర్ ఆర్టిస్టుగా వెన్నెల కిషోర్ ప్రహసనంతో పాటు.. కథలో వెంకటేష్ రేచీకటిని, వరుణ్‌తేజ్ నత్తిని వాడుకొన్న విధానం కూడా బాగా ప్లస్ అయ్యిందని, తమన్నా పాత్ర ఎఫ్ 2లో కంటే ఈ సినిమాలో బాగా ఎలివేట్ అయ్యిందని తెలుస్తోంది. క్లైమాక్స్ ఎపిసోడ్ మొత్తం ఓ డిఫరెంట్ కాన్సెప్టుతో తీశారట. ఆ ఎపిసోడ్ చూసి, థియేటర్ల నుంచి నవ్వుకొంటూ బయటకు వస్తారని.. చిత్రబృందం ధీమాగా చెబుతోంది. ఈమధ్య ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా, అందులోనూ పెద్ద స్టార్లు నటించిన సినిమా రాలేదు. ఆ రకంగా ఎఫ్ 3 కాస్త రిలీఫ్ ఇవ్వబోతోందనుకోవచ్చు.