లాక్ డౌన్ అనంతరం థియేటర్లలోకి వచ్చి సంచలన విజయం సాధించిన కేజిఎఫ్ 2, ఆర్.ఆర్ ఆర్ సినిమాలు ఓటి టి లోకి వచ్చేశాయి. అయితే ఓ టి టి లో ప్రదర్శించే విషయంలో ఈ రెండు సినిమాలు తీసుకున్న వైఖరి పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన కే జి ఎఫ్ 2 సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఇంకేముంది అని అమెజాన్ సబ్స్క్రిప్షన్ ఉన్న ప్రేక్షకులంతా ఆనంద పడిపోయేలా లోపు అమెజాన్ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. ఇదివరకే అమెజాన్ ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న వారు కూడా ఈ సినిమా చూడాలంటే తాజాగా మరొకసారి 199 రూపాయలు చెల్లించి ఈ సినిమాను రెంట్ కు తీసుకోవాలి అంటూ అమెజాన్ ట్విస్ట్ ఇచ్చింది. అలా చెల్లిస్తే 48 గంటల వరకు ఆ సినిమాను చూడవచ్చని కండిషన్ పెట్టింది. ఇదే కోవలో రామ్ చరణ్ ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా అద్దెకు విడుదలవుతోంది. మే 20వ తేదీ నుండి జి 5 లో అందుబాటులోకి రానున్న ఈ సినిమా కూడా టీవీఓడీ – ట్రాన్సాక్షనల్ వీడియో ఆన్ డిమాండ్ పద్ధతి లో విడుదల కానుందని తెలుస్తోంది. అంటే ఈ సినిమాను కూడా ఒకసారి చూడడానికి, ఇదివరకే మీకు జీ5 సభ్యత్వం ఉన్నప్పటికీ తాజాగా మళ్లీ డబ్బులు చెల్లించాలి అన్నమాట.
విడుదలకు ముందు ఆయా ప్రభుత్వాలతో ఒప్పందాలు చేసుకుని ఈ రెండు సినిమాలు కూడా అత్యధిక ధరలతో విడుదలయ్యాయి. పైగా 1000 కోట్లకుపైగా వసూళ్ళు సాధించాయని ఆయా నిర్మాతలు పంపిణీదారులు చాటుకున్నారు. 1000 కోట్ల కు పైగా ప్రేక్షకుల నుండి ఇప్పటికే పిండుకొని కూడా ఓ టి టి లలో ఇదివరకే సభ్యత్వం ఉన్నవారు సైతం మళ్లీ డబ్బులు చెల్లించి చూసేలా నిర్మాతలు ఓటీటీలతో ఒప్పందం చేసుకోవడం పట్ల ప్రేక్షకులు గుర్రుగా ఉన్నారు. ఇది అలవాటు చేస్తే రాబోయే రోజులలో అన్ని ఓటీటీలు అన్ని సినిమాలకు ఇదే పద్ధతి అనుసరించే అవకాశం ఉందని వారు విమర్శిస్తున్నారు.
థియేటర్లలో టికెట్ రేట్లు విపరీతంగా పెంచిన కారణంగా ప్రేక్షకులు ఓ టిటి ల వైపు మొగ్గు చూపారు. పెరిగిన టికెట్ రేట్లు ఇటీవల విడుదలైన ఆచార్య, సర్కారు వారి పాట వంటి సినిమాల కి మేలు కంటే కీడే ఎక్కువ చేశాయనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇదే లాజిక్ ఓటీటీలకు కూడా వర్తిస్తుంది. సభ్యత్వం ఉన్నప్పటికీ కూడా కొత్త సినిమాలకు డబ్బులు చెల్లించి చూడాలనే సంప్రదాయం ఓటీటి లలో ఇదేవిధంగా పాటిస్తే మొదటికే మోసం వచ్చి subscribers తగ్గిపోయే అవకాశం కూడా ఉంది .ఏది ఏమైనా ఈ రెండు కొత్త సినిమాలు పాటిస్తున్న ఈ సంప్రదాయం పై ప్రేక్షకుల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి.