డీజీ స్థాయి ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఎట్టకేలకు ప్రభుత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. మంగళవారం పెద్దఎత్తున ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసినప్పటికీ ఏబీవీకి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటికే ఆయన తన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సీఎస్‌కు ఇచ్చి రెండు వారాలు దాటిపోయింది. అదే సమయంలో రెండు సార్లు సచివాలయానికి వెళ్లి సీఎస్‌ను నేరుగా కలిసే ప్రయత్నం చేశారు.
ఓ సారి కలిసిన సీఎస్ రెండో సారి మాత్రం కలవడానికి నిరాకరించారు. ఆయన పోస్టింగ్ అంశం ప్రాసెస్‌లో పెడతామని చెప్పారు కానీ స్పందించలేదు. దీంతో ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారని ప్రచారం ప్రారంభం కాగానే వెంటనే సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చారు. రెండేళ్ల సస్పెన్షన్ మినహా 2022 ఫిబ్రవరి 8 నుంచి సర్వీస్ లోకి తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
తనను సస్పెన్షన్ చేసిన రోజు నుంచి సర్వీస్ లోకి తీసుకోవాలని కోర్టు కూడా అదే చెప్పిందని ఏబీ వెంకటేశ్వరరావు వాదిస్తున్నారు. అయితే ఇప్పటికైతే ఆ రెండేళ్ల సస్పెన్షన్ అలాగే ఉంది. ఇప్పుడు కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు. సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చారు. జీఏడీలో రిపోర్ట్ చేయమని ఇచ్చారు. ఈ పరిణామంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయకుండానే సస్పెన్షన్ ఎత్తివేయగలిగారు. కోర్టు ధిక్కరణ నుంచి తప్పించుకోగలిగారు. మరి పోస్టింగ్ ఇవ్వడానికి ఇంకా ఎంత కాలం తీసుకుంటారో తెలియదు కానీ.. మళ్లీ ఏదో కారణం చెప్పి సస్పెన్షన్ వేటు వేసినా ఆశ్చర్యం లేదన్న వాదన ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది.